ప్రభుత్వ వైఖరిని, విధానాలు లోపరహితమని అనుకోలేము. అలాగని వాటిని ఎవరైనా తప్పుపడితే ప్రభుత్వ పెద్దలకి ఆగ్రహం వచ్చేస్తుంది. అదే... ప్రభుత్వంలో పనిచేస్తున్న ఓ అధికారే తప్పుపడితే ఇంకేమైనా ఉందా?ముందుగా సస్పెన్షన్, తర్వాత బదిలీ, ఆ తర్వాత కక్ష సాధింపులు మొదలైపోతాయి. కనుక ప్రభుత్వోద్యోగులు ఎవరూ ప్రభుత్వ వైఖరిని, విధానాల గురించి మాట్లాడే సాహసం చేయరు.
కానీ నల్గొండ జిల్లా కట్టంగూర్ మండలం కేంద్రంలో వ్యవసాయ విస్తరణ అధికారిగా పనిచేస్తున్న కల్లేపల్లి పరశురాములు నేరుగా ముఖ్యమంత్రి కేసీఆర్‌కే రైతుబంధు పధకంలో లోపాన్ని ఎత్తిచూపిస్తూ ఓ లేఖ వ్రాశారు. సిఎం కేసీఆర్ పేరిట ప్రగతి భవన్‌కి వ్రాసిన ఆ లేఖలో, రైతుబంధు పధకాన్ని 5 ఎకరాలు అంతకంటే తక్కువ వ్యవసాయభూమి ఉన్న రైతులకే పరిమితం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ పధకంలో అంతకుమించి భూములున్నవారికి ఇస్తున్న సొమ్ముతో పొలాలలోకి వెళ్ళేందుకు కాలిబాటలు నిర్మించేందుకు ఉపయోగిస్తే బాగుంటుందని కల్లేపల్లి పరశురాములు సిఎం కేసీఆర్‌కి సూచించారు.
భూస్వాములకి, రాజకీయ నాయకులకి, వివిద రంగాలలో ప్రముఖులకి రైతుబంధు అవసరమే లేదు. కానీ ప్రభుత్వం వారికి ఎంత వ్యవసాయ భూములు అంతకి లెక్కకట్టి సొమ్ము చెల్లిస్తోంది. కానీ నిరుపేద కౌలు రైతులకి మాత్రం రైతుబంధు ఇచ్చేందుకు సిఎం కేసీఆర్ నిరాకరిస్తున్నారు. కనుక రైతుబంధు విధానంపై సర్వత్రా విమర్శలు, అభ్యంతరాలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి. కానీ ప్రభుత్వం మాత్రం తన విధానం మార్చుకోలేదు.
ఇప్పుడు ప్రభుత్వంలో అధికారిగా పనిచేస్తున్న కల్లేపల్లి పరశురాములు నేరుగా సిఎం కేసీఆర్‌కి లేఖ ద్వారా ఈ విధానంలో మార్పు చేయాలని విజ్ఞప్తి చేశారు. క్షేత్రస్థాయిలో పనిచేసే ఆయనకి రైతుల అవసరాలు, వారు ఎదుర్కొంటున్న సమస్యల గురించి పూర్తి అవగాహన ఉంటుంది కనుక మంచి సూచనే చేశారని అర్దమవుతోంది.
మంత్రి కేటీఆర్ ప్రజల నుంచి వచ్చే ఇటువంటి నిర్మాణాత్మకమైన సూచనలను, సలహాలను స్వీకరించి అమలుచేయడానికి వెనకాడరు. కానీ సిఎం కేసీఆర్ తన నిర్ణయాన్ని వ్యతిరేకించేవారిని సహించరనే సంగతి అందరికీ తెలిసిందే. కనుక కల్లేపల్లి పరశురాములుపై సస్పెన్షన్, బదిలీ వేటు పడినా, ఉద్యోగం ఊడినా ఆశ్చర్యం లేదు.