కాంగ్రెస్ మొసలి కన్నీళ్ళని ఎవరు తుడువగలరు?

October 21, 2016


img

కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నంత కాలం దేశంలో రైతుల ఘోడు అసలు పట్టించుకోలేదు. ఆకారణంగా దేశవ్యాప్తంగా కొన్ని వేలమంది రైతులు ఆత్మహత్యలు చేసుకొన్నారు. అందుకు ఆ పార్టీ నేతలు అందరూ సిగ్గుతో తలవంచుకోవాలి. కానీ ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చాలా రాష్ట్రాలలో పాదయాత్రలు చేసి ఆ రైతుల కుటుంబాలని ఓదార్చారు. తద్వారా తమ ప్రభుత్వ అసమర్ధ కారణంగా వేలాదిమంది రైతులు చనిపోయారనే విషయం స్వయంగా దృవీకరించినట్లు అయ్యింది. తమ ప్రభుత్వ అసమర్ధత కారణంగానే వారు ఆత్మహత్యలు చేసుకొంటే, మళ్ళీ వారి కుటుంబాలని ఓదార్చేపేరుతో రాజకీయ మైలేజి పొందాలని చూడటం ఇంకా దారుణమైన విషయం. 

రాష్ట్ర కాంగ్రెస్ నేతలు కూడా ఇప్పుడు అలాగే ప్రవర్తిస్తున్నారు. తెలంగాణా రాష్ట్రం ఏర్పడేవరకు కూడా సమైక్య రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీయే పాలించింది. దాని పదేళ్ళ అసమర్ధపాలన పుణ్యమాని తెలంగాణా ఏర్పడిన తరువాత కూడా వందలాదిమంది రైతులు ఆత్మహత్యలు చేసుకొన్న సంగతి వారికీ తెలుసు. వారి ఆత్మహత్యలపై కూడా కాంగ్రెస్ నేతలు రాజకీయాలు చేయడం అందరూ చూశారు. నేటికీ వారు రైతుల కోసం మొసలి కన్నీళ్ళు కార్చుతూ నిసిగ్గుగా సభలు నిర్వహిస్తూ రాష్ట్ర ప్రజలని ఆకట్టుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు. 

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ నేతలు నిన్న రైతు గర్జన సభ నిర్వహించి తెరాస సర్కార్ పై పులులు, సింహాల్లా గర్జించడం చూస్తే వారి ధైర్యాన్ని మెచ్చుకోలేకుండా ఉండలేము. వారి హయంలో కరెంటు కోతలు, రైతుల ఆత్మహత్యలు తప్ప మరేవీ కనబడేవి కావు. కానీ తెరాస సర్కార్ ప్రవేశపెట్టిన మిషన్ కాకతీయ, మిషన్ భగీరధ తదితర పధకాలలో బారీగా అవినీతి జరుగుతోందని వారు విమర్శలు గుప్పించారు. కానీ తెరాస సర్కార్ ని విమర్శించేందుకు వారు ఏకరువు పెట్టిన ఆ పధకాలన్నీ ప్రభుత్వం అమలుచేస్తోందనే విషయం వారి నోటితో వారే చాటుకొనట్లు అయ్యింది. 

ఎన్నికలప్పుడు హామీలు ఇవ్వడమే తప్ప ఆ తరువాత ఏనాడు వాటిని గుర్తుంచుకొనే అలవాటు కూడా లేని కాంగ్రెస్ నేతలు, తెరాస చేసిన హామీల అమలు గురించి ప్రశ్నించడం ఇంకా హాస్యాస్పదంగా ఉంది. నిజమే. తెరాస సర్కార్ హామీల అమలులో కొంత వైఫల్యం చెందినమాట వాస్తవమే కానీ అసలు అమలుచేయకుండా లేదు. 

కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీయే అధికారంలో ఉన్నప్పటికీ చేయలేని అనేక అభివృద్ధి, సంక్షేమ పనులని, కనీసం ఎన్నికలలో పొత్తులు కూడా పెట్టుకొని తెరాస-భాజపాలు కలిసి చేసి చూపిస్తున్నాయి. రాష్ట్రంలో కళ్ళకి కట్టినట్లు జరుగుతున్న అభివృద్ధిపనులని కాంగ్రెస్ పార్టీ చూడటానికి ఇష్టపడకపోవచ్చునేమో గానీ ప్రజలు మాత్రం చూడగలుగుతున్నారు. కనీసం ఆ సంగతి కూడా గ్రహించనట్లుగా నటిస్తూ, రాష్ట్రం సర్వనాశనం అయిపోతోందన్నట్లు కాంగ్రెస్ నేతలు సభలు పెట్టుకొని మాట్లాడటం చాలా సిగ్గు చేటు. 

మనదేశంలో రాజకీయనేతలు, కాంట్రాక్టర్లు చెట్టాపట్టాలు వేసుకొనిసాగుతుంటారు. చాలా చోట్ల నేతలే కాంట్రాక్టర్ల అవతారంలో కనిపిస్తుంటారు. కనుక అవినీతి కూడా అనివార్యమే. ఒకవేళ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నట్లయితే దానిని కనిష్ట స్థాయిలో జరిగేలా జాగ్రత్తలు తీసుకొంటుంది. కాంగ్రెస్ హయంలో అది గరిష్ట స్థాయిలో ఉండేది. కనుక పచ్చ కామెర్లవాడికి లోకం అంతా పచ్చగానే కనబడటం సహజమే. తెరాస ప్రభుత్వంలో అవినీతి జరుగడం లేదని ఎవరూ చెప్పలేరు. ప్రతిపక్షాలు ఇంతగా పనిగట్టుకొని దాని గురించి మాట్లాడుతున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వారు అడుగుతున్న ప్రశ్నలకి ధైర్యంగా సంతృప్తికరమైన సమాధానాలు చెప్పగలిగేలా ఉంటే బాగుంటుంది. ప్రజలు కూడా హర్షిస్తారు.


Related Post