ప్రధానమంత్రి ఏదైనా రాష్ట్రానికి వచ్చివెళుతున్నప్పుడు ప్రోటోకాల్ ప్రకారం ఆ రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి, చీఫ్ సెక్రెటరీ, డిజిపి, తదితరులు స్వాగతం, వీడ్కోలు పలకాలి. కానీ ప్రధాని నరేంద్రమోడీపై కత్తులు దూస్తున్న తెలంగాణ సిఎం కేసీఆర్, ప్రోటోకాల్ కోసం తన తరపున ఓ మంత్రిని విమానాశ్రయానికి పంపించి సరిపెడుతున్నారు. కానీ ప్రధాని పర్యటనకి ముందు ఆ తర్వాత కూడా కేసీఆర్‌తో సహా మంత్రులు ప్రధాని నరేంద్రమోడీపై, కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తుంటారు. ప్రధాని నరేంద్రమోడీ తెలంగాణ రాష్ట్ర పర్యటనకి వచ్చిన ప్రతీసారి ఇదే తంతు కొనసాగుతోంది. జనవరి 19న మళ్ళీమారు ఈ తంతు జరుగబోతోంది.
హైదరాబాద్ నుంచి విజయవాడకి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలుని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్రమోడీ జనవరి 19న హైదరాబాద్ వస్తున్నారు. జనవరి 18న కేసీఆర్ ఖమ్మంలో బిఆర్ఎస్ బహిరంగసభ నిర్వహించబోతున్నారు. టిఆర్ఎస్‌ని బిఆర్ఎస్‌గా మార్చిన తర్వాత నిర్వహిస్తున్న ఈ తొలిసభకి కేసీఆర్‌తో కలిసి పనిచేసేందుకు ఆసక్తి చూపుతున్న ఇతర రాష్ట్రాల నాయకులు హాజరుకాబోతున్నారు. కనుక ఆ సభలో కేసీఆర్‌తో సహా వారందరూ ప్రధాని నరేంద్రమోడీ, బిజెపిలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడటం ఖాయం.
జనవరి 19న వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ని ప్రారంభించిన తర్వాత ఆ రోజు సాయంత్రం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో బిజెపి అధ్వర్యంలో జరిగే బారీ బహిరంగసభలో ప్రధాని నరేంద్రమోడీ పాల్గొనబోతున్నారు. కనుక తన ప్రభుత్వంపై కేసీఆర్ చేసిన విమర్శలకి బదులుగా ప్రధాని నరేంద్రమోడీ, బిజెపి నేతలు కూడా కేసీఆర్ ప్రభుత్వంమీద ప్రత్యారోపణలు చేయడం ఖాయమే. తెలంగాణ రాష్ట్రంలో సంక్రాంతి పండుగ తర్వాత మరోసారి బిఆర్ఎస్, బిజెపిల మద్య మరోసారి యుద్ధం జరుగబోతోంది.