జనవరి 18న ఖమ్మం సిఎం కేసీఆర్‌ బహిరంగసభ… దేనికంటే

January 09, 2023


img

ఈనెల 18వ తేదీన సిఎం కేసీఆర్‌ ఖమ్మంలో బహిరంగసభలో పాల్గొనబోతున్నారు. టిఆర్ఎస్‌ని బిఆర్ఎస్‌గా మార్చిన తర్వాత తొలిసారిగా ఖమ్మం జిల్లాలో బహిరంగసభ నిర్వహిస్తుండటానికి మూడు కారణాలున్నాయి. 

1. ఈ నెల 12వ తేదీ నుంచి సిఎం కేసీఆర్‌ జిల్లా పర్యటనలు ప్రారంభించనున్నారు. ఆరోజున మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలలో పర్యటించి అక్కడ కొత్త నిర్మించిన సమీకృత కలెక్టరేట్ కార్యాలయాలను ప్రారంభిస్తారు. పలు అభివృద్ధిపనులను ప్రారంభిస్తారు. ఈ నెల 18న ఖమ్మం జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. 

2. ఇటీవల వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఇద్దరూ ఖమ్మంలో బహిరంగసభలు నిర్వహించి అక్కడి నుంచే తెలంగాణ రాష్ట్రంలో తమతమ పార్టీలను విస్తరించి బలోపేతం చేసుకొనేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. 

3. టిఆర్ఎస్‌ని బిఆర్ఎస్‌గా ఎందుకు మార్చవలసివచ్చిందో ప్రజలకి సభాముఖంగా మరోసారి వివరించి, టిఆర్ఎస్‌ పార్టీ పేరు, దాని స్థాయి మారిందే తప్ప తెలంగాణ రాష్ట్రంతో దాని అనుబందం, రాష్ట్రం పట్ల దాని నిబద్దత మారలేదని ప్రజలకి తెలియజేప్పేందుకు.    

కనుక మూడు జిల్లాలలో సమీకృత కలెక్టరేట్ కార్యాలయాల ప్రారంభోత్సవాలను పురస్కరించుకొని సిఎం కేసీఆర్‌జిల్లా పర్యటనలు చేస్తూ ఖమ్మంలో బహిరంగసభ నిర్వహించబోతున్నారు. ఖమ్మం జిల్లాలో టిడిపి, వైఎసార్ తెలంగాణ పార్టీలకి పట్టు ఉంది. పక్కనే ఉన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాపై వాటికి కొంత పట్టు ఉంది. కనుక ఆ రెండు పార్టీలు ఆ రెండు జిల్లాలపై మరింత పట్టు పెంచుకొంటే, ఆ జిల్లాలు బిఆర్ఎస్‌ చేతిలో నుంచి జారిపోయే ప్రమాదం ఉంటుంది. 

వచ్చే ఎన్నికలలో బిఆర్ఎస్‌, బిజెపిల మద్య చాలా తీవ్రమైన పోటీ ఉంటుంది కనుక ప్రతీ ఒక్క సీటు చాలా కీలకమైనదే. ఒకవేళ టిడిపి, వైఎసార్ టీపీలు ఆ రెండు జిల్లాలో సీట్లు గెలుచుకొంటే, అవి తప్పకుండా రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వం ఏర్పాటుకి సహకరిస్తాయి. కనుక ఆ రెండు జిల్లాలు బిఆర్ఎస్‌ చేజారిపోకుండా కాపాడుకోవడం చాలా అవసరం. 

ఇక టిఆర్ఎస్‌ని బిఆర్ఎస్‌గా మార్చడంపై ప్రజలలో నెలకొన్న అపోహలు, అనుమానాలు దూరం చేయకపోతే వచ్చే ఎన్నికలలో రాష్ట్రంలోనే బిఆర్ఎస్‌ తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంటుంది. కనుక ఖమ్మం వేదికగా ప్రజలకు ఈ మార్పు గురించి వివరణ ఇస్తూనే, ఈ సభకి ఇతర రాష్ట్రాల నాయకులను కూడా ఆహ్వానించడం ద్వారా జాతీయ స్థాయిలో బిఆర్ఎస్‌ ప్రస్థానం ఏవిదంగా సాగబోతోందో సిఎం కేసీఆర్‌ ప్రజలకి వివరించే ప్రయత్నం చేయనున్నారు. 


Related Post