బిఆర్ఎస్‌... కేసీఆర్‌ జాతీయ రాజకీయాలని కేటీఆర్‌ వ్యతిరేకిస్తున్నారా?

January 05, 2023


img

సిఎం కేసీఆర్‌ టిఆర్ఎస్‌ని బిఆర్ఎస్‌గా మార్చినప్పుడు ప్రతిపక్షాలు కూడా అభ్యంతరం చెప్పాయంటే తెలంగాణ రాష్ట్రంతో, ప్రజలతో టిఆర్ఎస్‌ పార్టీకి ఎంత బలమైన అనుబందం ఉందో అర్దం అవుతోంది. అయితే కేసీఆర్‌ నా మాటే శాసనం... అన్నట్లు టిఆర్ఎస్‌ని బిఆర్ఎస్‌గా మార్చేసి జాతీయ రాజకీయాలకి సిద్దం అయిపోతున్నారు. అప్పుడే ఏపీలో పార్టీ విస్తరణకి సన్నాహాలు మొదలుపెట్టేశారు కూడా. సంక్రాంతి పండుగ తర్వాత ఒకేసారి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో బిఆర్ఎస్‌ పార్టీని విస్తరించి, వచ్చే సార్వత్రిక ఎన్నికలలో పోటీ చేస్తామని కేసీఆర్‌ ఇటీవలే ప్రకటించారు. 

మల్లారెడ్డి, తలసాని, శ్రీనివాస్ బూర నర్సయ్య గౌడ్‌ వంటి కొందరు మంత్రులు బిఆర్ఎస్‌, కేసీఆర్‌, జాతీయ రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు కానీ కేటీఆర్‌ మాత్రం పెద్దగా మాట్లాడటం లేదు. ఆయన తెలంగాణ రాష్ట్రం, అభివృద్ధి, సంక్షేమ పధకాలు, సమస్యల గురించే ఎక్కువగా మాట్లాడున్నారు. అంటే కేటీఆర్‌ పార్టీ పేరు మార్పు, బిఆర్ఎస్‌తో తన తండ్రి జాతీయ రాజకీయాలలో ప్రవేశించడాన్ని కేటీఆర్‌ వ్యతిరేకిస్తున్నారా లేదా అయిష్టంగా ఉన్నారా?అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 

నిజానికి కేసీఆర్‌ పార్టీ పేరు మార్చినప్పుడే టిఆర్ఎస్‌ నేతల్లో ఆందోళన వ్యక్తం అయిన్నట్లు వార్తలు వచ్చాయి. అలాగే తెలంగాణలో బిజెపి అధికారంలోకి రావాలని గట్టిగా ప్రయత్నిస్తున్నప్పుడు, కేసీఆర్‌ జాతీయ రాజకీయాలతో ప్రయోగాలు చేస్తుంటే మొదటికే మోసం వస్తుందేమో?అనే భయాలు కూడా పార్టీ నేతల్లో వ్యక్తం అవుతున్నాయి. ప్రధాని నరేంద్రమోడీ, అమిత్‌ షాలపై కత్తులు దూస్తుండటం వలన కేసీఆర్‌కి జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తున్నప్పటికీ, ఆయన చేస్తున్న ఈ రాజకీయ యుద్ధం వలన తెలంగాణ రాష్ట్రానికి, ప్రజలకి, చివరికి పార్టీకి కూడా నష్టం కలుగుతోందనే వాదనలు వినిపిస్తున్నాయి. 

కనుక కేసీఆర్‌ తెలంగాణకే పరిమితమై రాష్ట్రంలో మరో 10-15 ఏళ్ళు టిఆర్ఎస్‌ అధికారంలో కొనసాగేలా చేసుకొంటే బాగుండేదనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. బహుశః అందుకే మంత్రి కేటీఆర్‌ బిఆర్ఎస్‌... దాంతో తన తండ్రి జాతీయ రాజకీయ ప్రస్థానం గురించి ఎక్కువగా మాట్లాడేందుకు ఇష్టపడటంలేదనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే సిఎం కేసీఆర్‌ పట్టినపట్టు విడిచే రకం కాదు. కనుక ఆయన జాతీయ రాజకీయాలలోకి వెళ్ళిన తర్వాత కేటీఆర్‌ తెలంగాణ ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని చూసుకోవలసి ఉంటుంది కనుక కేటీఆర్‌ తెలంగాణకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారనుకోవచ్చు. 


Related Post