ప్రజలెన్నుకొన్న ప్రభుత్వాన్ని కూల్చాలనుకోవడం చాలా తప్పు. ఆ ప్రయత్నంలో దొరికిపోయిన ముగ్గురు బిజెపి ప్రతినిధులను కేసీఆర్ జైలుకి పంపించారు. అయితే ఆ కేసు దర్యాప్తుకి సంబందించిన కీలక సాక్ష్యాధారాలని సిట్‌కి బృందం ఆయన చేతికి అందివ్వడం కూడా తప్పు. కనుక ఈ కేసు దర్యాప్తుని సిట్ నుంచి సీబీఐకి బదిలీ చేశారు హైకోర్టు సింగిల్ జడ్జ్.
సిఎం కేసీఆర్ తన చేతికి అందిన ఆ సాక్ష్యాధారాలతో మునుగోడు ఉపఎన్నికల సమయంలో బిజెపిని రాజకీయంగా దెబ్బ తీయాలని ప్రయత్నించడం అందరికీ తెలుసు. కనుక కేసీఆర్ దీనిని ఓ రాజకీయ అస్త్రంగా భావిస్తున్నట్లు స్పష్టం అవుతోంది. బహుశః అందుకే తెలంగాణ ప్రభుత్వం ఈ కేసుని వదులుకోవడానికి ఇష్టపడటం లేదేమో? ఈ కేసు దర్యాప్తుని సీబీఐకి బదిలీ చేస్తూ హైకోర్టు సింగిల్ జడ్జ్ ఇచ్చిన తీర్పుని సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు ధర్మాసనంలో పిటిషన్ వేసింది. దానిపై చీఫ్ జస్టిస్ట్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ తుకారాంజీలతో కూడిన ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది.
ప్రభుత్వం తరపు న్యాయవాది ఈ కేసుపై వాదిస్తూ, ఈ కేసు దర్యాప్తుని సిట్‌కి నిష్పక్షపాతంగా జరుపుతోందని కానీ కేసుకి సంబందించిన సాక్ష్యాధారాలు బహిర్గతమైనందునే సీబీఐకి బదిలీ చేస్తున్నట్లు సింగిల్ జడ్జ్ చెప్పారన్నారు. అయితే ఈ కేసుపై ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పోలీస్ స్టేషన్‌లో చెప్పిన విషయాలనే సిఎం కేసీఆర్ మీడియా సమావేశంలో ప్రస్తావించారు తప్ప సిట్ సేకరించిన ఎటువంటి సాక్ష్యాధారాలను బయటపెట్టలేదన్నారు.
ప్రజా ప్రభుత్వాన్ని కూల్చివేయడానికి కుట్రలు చేసిన నిందితులకు వారు కోరుకొనే దర్యాప్తు సంస్థతోనే దర్యాప్తు జరపాలని అడిగే హక్కు ఉండదన్నారు. ఈ కేసులో సిఎం కేసీఆర్ ప్రతివాది కారు కనుక ఆయన మీడియాతో మాట్లాడిన అంశాల ఆధారంగా సింగిల్ జడ్జ్ తీర్పు చెప్పడం సరికాదన్నారు. కనుక ఈ కేసు దర్యాప్తుని సీబీఐకి బదిలీ చేస్తూ సింగిల్ జడ్జ్ ఇచ్చిన తీర్పుని కొట్టివేయాలని, ఈ కేసుని మళ్ళీ సిట్‌కి అప్పగించాలని ప్రభుత్వ న్యాయవాది హైకోర్టుని కోరారు. దీనిపై బిజెపి, ముగ్గురు నిందితులు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ హైకోర్టు కేసుని వాయిదా వేసింది.
ఈ కేసు సిట్ చేతిలోనే ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం, సీబీఐ చేతిలోకి రావాలని కేంద్ర ప్రభుత్వం గట్టిగా కోరుకొంటుండటం గమనిస్తే బిఆర్ఎస్, బీజేపీ మద్య కొనసాగుతున్న రాజకీయ ఆదిపత్యపోరులో ఒకదానిపై మరొకటి పైచేయి సాధించేందుకు ఈ కేసుని అస్త్రంగా ఉపయోగించుకోవాలనుకొంటున్నాయని అర్దమవుతోంది.