తెలంగాణ కాంగ్రెస్‌ని గాడిన పెట్టగలవారు ఎవరు?

January 05, 2023


img

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో రేవంత్‌ రెడ్డి అనుకూల వ్యతిరేక వర్గాల మద్య జరుగుతున్న కుమ్ములాటలకి పరాకాష్టగా రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ మానిక్కం ఠాగూర్ తప్పుకోవడంతో కాంగ్రెస్‌ అధిష్టానం ఆయన స్థానంలో మహారాష్ట్రకి చెందిన మాణిక్‌రావు గోవిందరావు థాక్రేని నియమించింది. మానిక్కం ఠాగూర్‌ని గోవా కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జ్‌గా నియమించింది. 

మాణిక్‌రావు థాక్రే నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, మూడుసార్లు మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. ఏడేళ్ళపాటు మహారాష్ట్ర పిసిసి అధ్యక్షుడుగా కూడా వ్యవహరించారు. మహారాష్ట్రలో బిజెపి, శివసేనలని ధీటుగా ఎదుర్కొంటున్నారు. కనుక కుమ్ములాటలతో సతమతమవుతున్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీని ఆయనైతేనే గాడిన పెట్టి, రాష్ట్రంలో బిఆర్ఎస్‌, బిజెపిలను ధీటుగా ఎదుర్కొంటారని కాంగ్రెస్‌ అధిష్టానం భావిస్తోంది. 

తెలంగాణ కాంగ్రెస్‌లో ఇప్పుడు ప్రధాన సమస్య రేవంత్‌ రెడ్డి అనుకూల, వ్యతిరేక వర్గాల కుమ్ములాటలు. కాంగ్రెస్‌ నేతలందరూ కలిసికట్టుగా బిఆర్ఎస్‌, బిజెపిలతో పోరాడే బదులు వారిలో వారే కీచులాడుకొంటూ పార్టీని బలహీనపరుస్తున్నారు. కనుక మాణిక్‌రావు థాక్రే ముందుగా కాంగ్రెస్‌ పార్టీని చక్కదిద్దవలసి ఉంటుంది. అయితే కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే సీనియర్ నేతలందరికీ మొన్న ఫోన్‌ చేసి నిన్న జరిగిన సమావేశానికి హాజరుకావాలని ఆదేశించినా ఎవరూ హాజరుకాలేదు. కనుక కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జ్‌ మాణిక్‌రావు థాక్రే చెపితే వింటారా అంటే అనుమానమే. పోనీ రేవంత్‌ రెడ్డిని తప్పించేస్తే సీనియర్లు ఎవరైనా కేసీఆర్‌ని, బిఆర్ఎస్‌ నేతలనీ, బండి సంజయ్‌ని ధీటుగా ఎదుర్కొంటూ పార్టీని బలోపేతం చేయగలరా?అదీ అనుమానమే! కనుక తెలంగాణ కాంగ్రెస్‌ని బాగుపరచడం బహుశః ఎవరి తరం కాదేమో అనిపిస్తుంది. 


Related Post