పొంగులేటికి భద్రత తగ్గింపు... దేనికి సంకేతం?

January 04, 2023


img

ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వం హటాత్తుగా భద్రత తగ్గించింది. ప్రస్తుతం ఆయనకి 3+3 భద్రతా సిబ్బంది ఉండగా దానిని 2+2కి తగ్గించింది. అలాగే ఎస్కార్ట్ సర్వీసుని కూడా తొలగించింది. అయితే దీనిపై ఆయన ఏమీ స్పందించలేదు. 

ఖమ్మంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఇద్దరినీ సిఎం కేసీఆర్‌ చాలా కాలం నుంచే పక్కన పెట్టేశారు. అయియా ఇద్దరూ ఇంతకాలం సంయమనం పాటిస్తూ మౌనంగా ఉండిపోయారు. కానీ ఎన్నికలు సమీపిస్తున్నా కేసీఆర్‌ వైఖరిలో ఎటువంటి మార్పు కనిపించకపోవడంతో ఇద్దరూ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అందుకే ఇద్దరూ అనుచరులతో ఆత్మీయ సమావేశాలు జరుపుతూ తమ భవిష్య కార్యాచరణ గురించి చర్చించుకొంటున్నారు. ఇటీవల నూతన సంవత్సరం సందర్భంగా ఇద్దరూ తమ అనుచరులకు భారీ స్థాయిలో విందులు ఏర్పాటు చేశారు. 

వారిలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరో అడుగు ముందుకు వేసి “వచ్చే ఎన్నికలలో ఖమ్మం నుంచే మళ్ళీ లోక్‌సభకి పోటీ చేస్తాను కానీ ఏ పార్టీ తరపున చేస్తానో తర్వాత చెపుతానని” అన్నారు. తద్వారా కేసీఆర్‌ టికెట్‌ ఇవ్వకపోతే పార్టీ మారి పోటీ చేస్తానని చెప్పకనే చెప్పినట్లయింది. 

అయితే సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావు కూడా ఖమ్మం నుంచే మళ్ళీ పోటీ చేయాలనుకొంటున్నారు. కనుక కేసీఆర్‌ ఆయనకే మళ్ళీ టికెట్‌ ఇచ్చే అవకాశం ఉంది. కనుక పొంగులేటి వేరే దారి చూసుకోవడం ఖాయం. బహుశః అందుకే ప్రభుత్వం భద్రత తగ్గించి ఉండవచ్చు. 

ఇక తుమ్మల నాగేశ్వర రావు ఖమ్మం నుంచి శాసనసభకి పోటీ చేయాలనుకొంటున్నారు. కానీ ఖమ్మం నుంచి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌ మళ్ళీ పోటీ చేయడం ఖాయం. కనుక తుమ్మలకి కూడా టికెట్‌ లభించకపోవచ్చు. ఇటీవల చంద్రబాబు నాయుడు ఖమ్మంలో భారీ బహిరంగసభ విజయవంతంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. కనుక తుమ్మల నాగేశ్వర రావు మళ్ళీ టిడిపిలోకి వెళ్ళిపోవచ్చు లేదా బలమైన అభ్యర్ధుల కోసం చూస్తున్న బిజెపిలోకి వెళ్లిపోవచ్చు.


Related Post