తెలంగాణ బిజెపి అధ్యక్షుడిగా హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ని నియమించాలని బిజెపి అధిష్టానం ఆలోచిస్తున్నట్లు ఓ వార్త బయటకి వచ్చింది. బిఆర్ఎస్‌ని రాజకీయంగా చావుదెబ్బ తీయాలనే ఉద్దేశ్యంతోనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని బిజెపిలో చేర్చుకొని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయించి మునుగోడు ఉపఎన్నికలు తీసుకువస్తే, దానిలో బిజెపియే ఓడిపోవడం ఓ కారణమని తెలుస్తోంది. దీని వలన తెలంగాణలో బిజెపికి ఎదురుదెబ్బ తగలడమే కాక కేసీఆర్ ముందు బండి సంజయ్ ఎత్తులు పారవని బిజెపి పెద్దలు గ్రహించిన్న సమాచారం.
ఇక కేసీఆర్ బిఆర్ఎస్‌తో చురుకుగా పావులు కదుపుతూ పార్టీ విస్తరణకి సన్నాహాలు చేసుకొంటుంటే, తెలంగాణలో పరుగులు తీయాల్సిన బిజెపి ఒక్కసారిగా చల్లబడిపోవడం, కేసీఆర్‌ని కట్టడి చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఎంతగా సహకరిస్తున్నప్పటికీ బండి సంజయ్ ఈ అవకాశాలను అందిపుచ్చుకొని కేసీఆర్‌కి అడ్డుకట్టవేయలేకపోతున్నారని బిజెపి పెద్దలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇక ఈటల రాజేందర్‌ని ఎంచుకోవడానికి వెనుక కూడా బలమైన కారణాలే ఉన్నాయి. గతంలో ఆయన కేసీఆర్‌తో కలిసి పనిచేయడం వలన ఆయన గుట్లు, లోటుపాట్లు, బలహీనతలు, అలాగే ఆయన వ్యూహాలు, ఆలోచించే విధానం అన్నీ ఈటల రాజేందర్‌కి బాగా తెలిసి ఉంటాయి. రాష్ట్రంలో బీసీ జనాభా చాలా ఎక్కువ గనుక ఆ వర్గానికి చెందిన ఈటల రాజేందర్‌కి పార్టీ పగ్గాలు అప్పగిస్తే, వచ్చే ఎన్నికలలో ఆ వర్గం బిజెపివైపు ఆకర్షితులవుతారనే ఆలోచన కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
బండి సంజయ్ 2020, మార్చి 11న తెలంగాణ బిజెపి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. బిజెపి అధ్యక్షుడి పదవీకాలం రెండేళ్ళు కనుక మార్చి నాటికి అది పూర్తవుతుంది. అప్పుడు ఆయన స్థానంలో ఈటల రాజేందర్‌ని నియమించాలని బిజెపి అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
కానీ తెలంగాణలో నిద్రాణస్థితిలో ఉన్న బిజెపిని పరుగులు తీయించి, బిఆర్ఎస్‌కి ప్రత్యామ్నాయంగా ఎదిగే స్థాయికి తీసుకువచ్చిన ఘనత బండి సంజయ్‌కే దక్కుతుంది. కనుక ఒకవేళ వచ్చే ఎన్నికలలో గెలిచి రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి వస్తే బండి సంజయ్ ముఖ్యమంత్రి పదవికి అర్హుడవుతారు.
కానీ ఎన్నికలు దగ్గరపడుతున్న ఈ సమయంలో ఆయనని పక్కన పెట్టి ఈటల రాజేందర్‌కి పార్టీ పగ్గాలు అప్పగిస్తే ఆయనకే ముఖ్యమంత్రి అవకాశం ఇవ్వబోతున్నట్లు సూచించిన్నట్లవుతుంది. కనుక ఈ కారణంగా వారిరువురి మద్య భేధాభిప్రాయాలు మొదలైతే మొదటికే మోసం రావచ్చు. కనుక బిజెపి అధిష్టానం మరింత లోతుగా ఆలోచించి నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది.