సోమవారం సాయంత్రం సుమారు వంద కార్లలో ఏపీ నుంచి కొందరు నాయకులు ఊరేగింపుగా తెలంగాణ భవన్‌కి వచ్చి సిఎం కేసీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. దీనిపై తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ స్పందిస్తూ, “సిఎం కేసీఆర్ ఇక్కడి నుంచి వంద కార్లు పంపించి ఏపీ నేతలని రప్పించుకొన్నారు. ఏపీలో తనకి విపరీతమైన ఫాలోయింగ్ ఉందని గొప్పలు చెప్పుకొనేందుకే కేసీఆర్ ఇంత హడావుడి చేశారు.
గత ఎన్నికల సమయంలో తెలంగాణ సెంటిమెంట్ రగిలించి ఆంద్రావాళ్ళని తిట్టిపోసిన కేసీఆర్ ఇప్పుడు అదే ఆంద్రావాళ్ళని తన మాయమాటలతో మభ్యపెట్టాలని ప్రయత్నిస్తున్నారు. ఆంద్రా బిర్యానీ పేడలా ఉంటుందని అవహేళన చేసిన కేసీఆర్ ఇప్పుడు ఆంధ్రాలో పార్టీని విస్తరించి అక్కడి ప్రజలను ఉద్దరిస్తానని చెపుతున్నారు. ముందు పోలవరం ప్రాజెక్టుపై కేసీఆర్ తన వైఖరిని ప్రకటించాలి.
అసలు తెలంగాణ బిఆర్ఎస్ అధ్యక్షుడు ఎవరు? తెలంగాణ పార్టీకి అధ్యక్షుడు లేడు కానీ కేసీఆర్ ఏపీ బిఆర్ఎస్ పార్టీకి అధ్యక్షుడుని నియమించడం చాలా విడ్డూరంగా ఉంది. ఓ పక్క వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇస్తున్నానని గొప్పలు చెప్పుకొంటూ, గృహావసరాలకు వినియోగించే విద్యుత్ ఛార్జీలు పెంచేస్తున్నారు. తెలంగాణ డిస్కంలు వేలకోట్లు నష్టాలలో కూరుకుపోయాయి. ధనిక రాష్ట్రమైన తెలంగాణని అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేశారు.
కేసీఆర్ రైతులకి సకల సదుపాయాలు కల్పిస్తుంటే ఇంకా ఆత్మహత్యలు ఎందుకు చేసుకొంటున్నారు? రైతుల ఆత్మహత్యలలో తెలంగాణ రాష్ట్రంలో దేశంలో 4వ స్థానంలో ఉన్నమాట నిజమా కాదా కేసీఆర్ చెప్పాలి.
మేకిన్ ఇండియాపై కేసీఆర్ చేస్తున్న ఆరోపణలు అవాస్తవం. భారత్ ప్రపంచంలో వందకి పైగా దేశాలకి కరోనా వ్యాక్సిన్లు అందించింది. అనేక అంతర్జాతీయ సంస్థలు భారత్‌కి వచ్చి వివిద రాష్ట్రాలలో తమ ఉత్పత్తులు తయారుచేస్తున్నాయి. వాటిలో హైదరాబాద్ కూడా ఉందనే విషయం కేసీఆర్‌కి తెలియదా?” అంటూ బండి సంజయ్ నిలదీశారు.