రాజకీయాలకు వందే భారత్‌ రైళ్ళపై రాళ్ళ దాడులా?

January 03, 2023


img

మన తెలుగు రాష్ట్రాలకి వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్ళు ఇంకా కేటాయించనందుకు అందరూ బాధపడుతుంటే, పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి కేటాయించిన  బిజెపి వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలుపై కొందరు దుండగులు రాళ్ళ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన సోమవారం సాయంత్రం 5.10 గంటలకి కుమార్‌ గంజ్ రైల్వే స్టేషన్‌కి సమీపంలో జరిగింది. ఈ రాళ్ళ దాడిలో ట్రైన్ నంబర్: 22303, సీ13 కోచ్ అద్దాలు పగిలిపోయాయి. అయితే అదృష్టవశాత్తు లోపల ఉన్న ప్రయాణికులకు ఎటువంటి గాయాలు కాలేదు. రైలు మాల్దా స్టేషన్ చేరుకొన్న తర్వాత సిబ్బంది అక్కడి రైల్వే అధికారులకి ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు మొదలుపెట్టారు. 

ఈ దాడి వెనుక అధికార తృణమూల్ కాంగ్రెస్‌ కార్యకర్తలు ఉండవచ్చని బెంగాల్ బిజెపి అధ్యక్షుడు సువేందు అధికారి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే డిసెంబర్‌ 30వ తేదీన ప్రధాని నరేంద్రమోడీ వర్చువల్ విధానంలో ఈ రైలుని ప్రారంభిస్తున్నప్పుడు, హౌరా స్టేషన్లో జరిగిన ఈ కార్యక్రమానికి రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్, బెంగాల్ గవర్నర్‌ సీవీ ఆనంద్ బోస్, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హాజరయ్యారు. 

అయితే ఈ అధికారిక కార్యక్రమంలో బిజెపి కార్యకర్తలు జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేయడంతో మమతా బెనర్జీ అలిగి ప్రేక్షకుల మద్య కూర్చోన్నారు. అధికారిక కార్యక్రమాన్ని బిజెపి సభగా మార్చేశారని ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఆమె ఆగ్రహాన్ని పట్టించుకోకుండా బిజెపి కార్యకర్తలు జైశ్రీరామ్ అంటూ నినాదాలు చేయడంతో ఇందుకు బదులుగా తృణమూల్ కార్యకర్తలు సోమవారం సాయంత్రం నడుస్తున్న వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ మీద రాళ్ళ దాడి చేసి ఉండవచ్చని సువేందు అధికారి అనుమానం వ్యక్తం చేశారు. 

ప్రతిష్టాత్మకమైన వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ బెంగాల్ రాష్ట్రానికి కేటాయిస్తే దానిపై ఈవిదంగా రాళ్ళ దాడి చేయడం నీచ రాజకీయాలకి పరాకాష్ట అని అన్నారు. దీనిపై జాతీయ దర్యాప్తు సంస్థతో దర్యాప్తు చేయించాలని ఆయన డిమాండ్‌ చేశారు. 


Related Post