బిఆర్ఎస్ జాతీయ ప్రస్థానం పొరుగు రాష్ట్రమైన ఏపీతోనే ప్రారంభం అయ్యింది. ఏపీకి చెందిన పలువురు కుల సంఘాల నాయకులు సోమవారం తెలంగాణ భవన్‌లో సిఎం కేసీఆర్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్‌లో చేరారు. వారిలో మాజీ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్‌ని ఏపీ బిఆర్ఎస్ అధ్యక్షుడిగా నియమిస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. ఏపీలో ఎమ్మెల్యేలతో సహా పలువురు సీనియర్లు బిఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నారని సిఎం కేసీఆర్ ప్రకటించారు.
సంక్రాంతి పండుగ తర్వాత దేశవ్యాప్తంగా 6.64 లక్షల గ్రామాలలో బిఆర్ఎస్ పార్టీ శాఖలు ప్రారంభిస్తామని సిఎం కేసీఆర్ ప్రకటించారు. మొదట దేశంలో 4,183 శాసనసభ, 543 లోక్‌సభ నియోజకవర్గాలలో బిఆర్ఎస్ కార్యకలాపాలు ప్రారంభిస్తుందని చెప్పారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి, గుజరాత్ నుంచి అస్సోం వరకు దేశం బిఆర్ఎస్ కార్యక్రమాలు ప్రారంభిస్తామని చెప్పారు.
కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు అమ్మివేస్తున్న వైజాగ్ స్టీల్ ప్లాంట్, ఎల్ఐసీ వంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నిటినీ కేంద్రంలో బిఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక తిరిగి స్వాధీనం చేసుకొని ప్రభుత్వ ఆధీనంలోనే నడిపిస్తుందని కేసీఆర్ చెప్పారు. దేశ రాజకీయాలలో గుణాత్మకమైన మార్పు, దేశాభివృద్ధి కోసం మొదలుపెట్టిన ఈ ప్రయత్నంలో అనేక కష్టాలు, అవహేళనలు ఎదురవుతాయని, కానీ వాటన్నిటినీ తట్టుకొని ముందుకే సాగుతామని చెప్పారు. దేశవ్యాప్తంగా ఏటా 25 లక్షల మందికి దళితబంధు పధకం అమలుచేస్తామని, రైతులందరికీ ఉచిత విద్యుత్ అందజేస్తామని సిఎం కేసీఆర్ చెప్పారు.
ఏపీ ప్రజలలో కేసీఆర్ పట్ల మిశ్రమ స్పందన ఉంది. కేవలం 8 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి చూపినందుకు కొందరు కేసీఆర్‌ని అభిమానిస్తుండగా, రాష్ట్రాన్ని విడగొట్టి ఏపీకి దయనీయ పరిస్థితి కల్పించినందుకు కొందరు నేటికీ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేపద్యంలో ఏపీలోనే బిఆర్ఎస్ పార్టీ తొలి అడుగు పడటం, ఆ రాష్ట్రం నుంచే కొందరు నాయకులు హైదరాబాద్ తరలివచ్చి కేసీఆర్‌కి జైకొట్టి బిఆర్ఎస్‌లో చేరడం విశేషం.