ఆరేళ్ళ తర్వాత పెద్దనోట్ల రద్దుపై ఈ తీర్పు... ఏం ప్రయోజనం?

January 02, 2023


img

2016, నవంబర్ 8వ తేదీన పెద్దనోట్ల రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొంటే, దానిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఒకటీ రెండూ కాదు... ఏకంగా 58 పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిపై విచారణ జరిపి తీర్పు చెప్పడానికి సుప్రీంకోర్టుకి ఆరేళ్ళు పట్టింది. ఆరేళ్ళ విచారణ తర్వాత కేంద్ర ప్రభుత్వం నిర్ణయంలో తప్పులేదని జస్టిస్ ఎస్.ఏ.నజీర్ నేతృత్వంలో ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈరోజు తేల్చి చెప్పింది. 

వారిలో జస్టిస్ గవాయ్ కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని గట్టిగా సమర్ధించగా, జస్టిస్ నాగరత్న మాత్రం ఈ నిర్ణయం మంచిదే అయినప్పటికీ దీనిని గెజిట్ నోటిఫికేషన్‌ ద్వారా కాకుండా ప్లీనరీ చట్టం రూపంలో ఇచ్చి ఉండాల్సిందని అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే ఎప్పుడో ఆరేళ్ళ క్రితం ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చేసింది కనుక జరిగిపోయినవాటిని మేము మాచలేము కానీ భవిష్యత్‌లో జరుగబోయేవాటిని సరిచేయగలమని చెపుతూ 58 పిటిషన్లని సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టివేసింది.   

రూ.500, 1,000 పెద్ద నోట్ల వలన దేశంలో నకిలీ నోట్ల చలామణి, నల్లధనం పెరిగిపోయిందని, దాంతో ఉగ్రవాదులు ఆయుధాలు సమకూర్చుకొంటున్నారని కేంద్ర ప్రభుత్వం వాదించింది. ఆ వాదనలు నిజమే కావచ్చు. అయితే రూ.1,000 కంటే మరింత పెద్ద నోట్లను ప్రవేశపెట్టడాన్నే అందరూ తప్పు పడుతున్నారు. పెద్ద నోట్ల రద్దుతో దేశ ప్రజలు పడిన కష్టాలను పక్కన పెడితే, మొదట్లో మార్కెట్లో విరివిగా చలామణిలో ఉండే రూ.2,000 నోట్లు ఏడాదిన్నరలోగానే మాయం అయిపోయాయి. కానీ దేశంలో ఎప్పుడు ఎక్కడ ఎన్నికలు జరిగితే అప్పుడు మాత్రమే ఆ నోట్లు బయటకు వస్తుంటాయి. అంటే రూ.2000 నోట్లన్నీ నల్లధనంగా మారిపోయాయని స్పష్టమవుతోంది. 

అలాగే దేశంలో ఎక్కడో అక్కడ రూ.2,000 నకిలీ నోట్లను పోలీసులు పట్టుకొన్నారనే వార్తలు వస్తూనే ఉన్నాయి. నేటికీ సరిహద్దుల అవతలి వైపు నుంచి ఉగ్రవాదులు, తుపాకులు దేశంలోకి వస్తూనే ఉన్నాయి. అంటే పెద్ద నోట్ల రద్దుకి కేంద్ర ప్రభుత్వం చెప్పిన మూడు ప్రయోజనాలు పూర్తిగా సాధించలేకపోయిన్నట్లు అర్దం అవుతోంది. 

కనుక మళ్ళీ నల్లధనంగా మారిపోయిన ఆ రూ.2,000 నోట్లను, వాటి నకిలీ నోట్ల బెడదని వదిలించుకోవాలనుకొంటే వాటినీ రద్దు చేస్తే మంచిది. ఎందుకంటే సామాన్య ప్రజల వద్ద ఆ నోట్లు లేవు కనుక ఎవరికీ ఎటువంటి నష్టమూ, కష్టమూ, అభ్యంతరమూ ఉండదు.


Related Post