తెలంగాణ రాష్ట్ర నాస్తిక సంఘం అధ్యక్షుడు బైరి నరేష్ హిందువుల మనోభావాలు దెబ్బ తినేవిదంగా అయ్యప్పస్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి హనుమకొండ జిల్లా కమలాపురం మండలంలో అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. అతనితో పాటు హనుమంతు అనే మరో యువకుడిని కూడా పోలీసులు కోర్టులో హాజరుపరచగా ఇద్దరికీ 14 రోజులు జ్యూడీషియల్ రిమాండ్ విధించింది. పోలీసులు ఇద్దరినీ చర్లపల్లి జైలుకి తరలించారు.
దీంతో ఈ గొడవ సర్దుమణుగుతుందని భావిస్తే, ఈరోజు బైరి నరేష్ వ్యాఖ్యలను సమర్ధిస్తూ అగ్నితేజ్ అనే మరోయువకుడు సోషల్ మీడియాలో కొన్ని సందేశాలు పోస్ట్ చేయడంతో వెంటనే పోలీసులు అప్రమత్తమై అతని ఇంటికి వెళ్ళగా అతను ఇంట్లో లేదు. అతని గురించి తల్లిని ప్రశ్నించగా అతను ఎక్కడ ఉంటున్నాడో.. ఏం చేస్తున్నాడో కూడా తమకి తెలియదని చెప్పారు. తన కొడుకు నాస్తికుడే కానీ తాము మాత్రం ఇంట్లో దేవుడిని పూజిస్తుంటామని చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని అగ్నితేజ్ కోసం గాలిస్తున్నారు. దొరికితే అతను కూడా జైలుకి వెళ్ళక తప్పదు.
మన దేశంలో అనేక కులాలు, మతాలు, భాషలు, సంస్కృతులు, విశ్వాసాలు ఉన్నాయి. కనుక ఒకరి విశ్వాసాలను మరొకరు గౌరవించడం కనీస ధర్మం. కానీ భావప్రకటన స్వేచ్చ ఉంది కదా అని మరొకరి మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడితే పోలీసులు, కేసులు ఎలాగూ తప్పవు. వాటితో పాటు సమాజం నుంచి ఛీత్కారాలు కూడా తప్పవు.
బైరి నరేష్ తదితరులు నాస్తికవాదం గురించి శాస్త్రీయంగా తమ అభిప్రాయాలను నిర్భయంగా వ్యక్తంచేయవచ్చు. కానీ దేవుడు లేడని వాదించేందుకు ఏదో ఓ మతాన్ని కించపరుస్తూ మాట్లాడటమే తప్పు.
మన ఇస్రో శాస్త్రవేత్తలు అంతరిక్షంలోకి అనేక ఉపగ్రహాలు పంపుతుంటారు. అత్యాధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో వాటిని తయారుచేస్తుంటారు. ప్రపంచదేశాలు ఊహించనివిదంగా మంగళగ్రహం మీదకి కూడా ఉపగ్రహం పంపించారు. అయినా మానవ ప్రయత్నానికి భగవంతుడి ఆశీర్వాదం కూడా అవసరమని గట్టిగా నమ్మే ఇస్రో శాస్త్రవేత్తలు తమ ప్రతీ ప్రయోగానికి ముందు సూళ్ళూరుపేటలో అమ్మవారి ఆలయానికి వెళ్ళి ప్రత్యేకపూజలు చేస్తుంటారు. అంతటి మేధావులే మనకి తెలియని అపూర్వమైన శక్తి ఏదో ఉందని అదే ఈ ప్రపంచాన్ని నడిపిస్తోందని నమ్ముతుంటే, నాస్తిక సమాజం పేరుతో హిందూ మతాన్ని, దేవుళ్ళని కించపరచడం అల్పత్వం, అజ్ఞానమే.