తెలంగాణలో సిఎం కేసీఆర్‌కి, బిఆర్ఎస్ పార్టీకి ప్రజలలో కొంత సానుకూలత, కొంత వ్యతిరేకత ఉందని అందరికీ తెలుసు. దానికి కారణాలు కూడా అందరికీ తెలుసు.
కేసీఆర్ తాను చేసిన అభివృద్ధి పనులు, అమలుచేస్తున్న సంక్షేమ పధకాలను చూసి ప్రజలు మళ్ళీ తమకే ఓట్లు వేస్తారని గట్టిగా నమ్ముతున్నారు. దానికి తోడు ఎన్నికల సమయంలో రకరకాల వ్యూహాలు రచిస్తూ, పోల్ మేనేజిమెంట్ చేయడంలో కేసీఆర్‌ని మించినవారు లేరు. అందుకే వచ్చే ఎన్నికలలో 100కి పైగా సీట్లు సాధించి మళ్ళీ అధికారంలో కొనసాగుతామని కేసీఆర్ చెపుతున్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలహీనపడటంతో దాని స్థానంలో ప్రవేశించిన బిజెపి ఈ రెండుమూడేళ్ళలో చాలా బలపడింది. కనుక వచ్చే ఎన్నికలలో తెలంగాణలో మిషన్-90 పేరుతో కనీసం 90 సీట్లు గెలుచుకొనేందుకు బిజెపి కూడా వ్యూహాలు సిద్దం చేసుకొంటోంది. అయితే కేసీఆర్ పట్ల ప్రజలలో నెలకొన్న వ్యతిరేకతనే బిజెపి తన బలం అనుకొంటోంది తప్ప వచ్చే ఎన్నికలో 119 నియోజకవర్గాలలో పోటీ చేసేందుకు బిజెపి వద్ద బలమైన అభ్యర్ధులే లేరు.
అందుకే అది కాంగ్రెస్, టిఆర్ఎస్ నేతలకు వలవేస్తున్నట్లు భావించవచ్చు. కానీ ఇంతవరకు ఆ రెండు పార్టీల నుంచి ఏ పెద్ద నేత బిజెపిలో చేరకపోవడం గమనిస్తే ఆ ప్రయత్నాలు కూడా ఫలించడంలేదని అర్దం అవుతోంది. మున్ముందు ఎన్నికలు దగ్గర పడిన తర్వాత బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలలో టికెట్లు లభించని కొంతమంది బిజెపిలో చేరడం ఖాయం. అయినా 119 నియోజకవర్గాలలో పోటీ చేసేందుకు బిజెపి వద్ద బలమైన అభ్యర్ధులు సరిపోకపోవచ్చు.
ఒకవేళ ఎలాగో అందరినీ పోగేసుకొన్నా వారిలో ఎంతమంది కొమ్ములు తిరిగిన మంత్రులు, బిఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఢీకొని నిలబడగలరు?నిలబడి ఓడించగలరు?అని ఆలోచిస్తే వారి సంఖ్య సుమారు 15-20 మందికి మించకపోవచ్చుననిపిస్తుంది. కనుక తెలంగాణ ప్రజలలో కేసీఆర్, బిఆర్ఎస్ పట్ల నెలకొన్న వ్యతిరేకత బిజెపికి తోడ్పడుతుందేమో కానీ అదే బిజెపిని గెలిపించలేదు.
వచ్చే ఎన్నికలలో బిఆర్ఎస్‌కి ఖచ్చితంగా కొంత వ్యతిరేకత ఉంటుంది. కనుక దానిని ఉపయోగించుకోవడానికి వచ్చే ఎన్నికలే బిజెపికి చివరి అవకాశమని చెప్పవచ్చు. ఒకవేళ వచ్చే ఎన్నికలలో కూడా బిఆర్ఎస్ గెలిస్తే రాష్ట్రంలో అది మరింత బలపడుతుంది. అప్పుడు బిజెపి ఎన్నికల మార్గంలో వెళ్ళి తెలంగాణలో అధికారం చేజిక్కించుకోలేకపోవచ్చు. కనుక తెలంగాణలో అధికారంలోకి రావాలని బిజెపి పట్టుదలగా ఉన్నట్లయితే ముందుగా కొమ్ములు తిరిగిన బిఆర్ఎస్ అభ్యర్ధులను ఢీకొని ఓడించగల అభ్యర్ధులను వెతికి పట్టుకోవాలి. లేకుంటే వాపుని చూసి బలుపు అనుకొని బోర్లా పడటం ఖాయం.