నలుగురు బిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై దర్యాప్తుని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ (ప్రత్యేక దర్యాప్తు బృందం) నుంచి సీబీఐకి బదిలీ చేస్తూ హైకోర్టు సింగిల్ జడ్జ్ జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి ఇచ్చిన ఆర్డర్ కాపీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి అందింది.
ఈ దర్యాప్తుని సీబీఐకి అప్పగించడానికి ఒకటీ రెండూ కాదు 45 సహేతుకమైన కారాణాలను న్యాయమూర్తి దానిలో పేర్కొన్నారు. ఈ కేసులో కీలక సాక్ష్యాధారాలను సిఎం కేసీఆర్‌కి, మీడియాకి ఎవరు ఇచ్చారని న్యాయమూర్తి ప్రశ్నించారు. ఎమ్మెల్యేల కొనుగోలు చేయాలని ప్రయత్నించడం ఎంత తప్పో ఈ కేసుకి సంబంధించి సాక్ష్యాధారాలను సిఎం కేసీఆర్‌కి, మీడియాకి అందించడం కూడా అంతే తప్పని న్యాయమూర్తి అభిప్రాయం వ్యక్తం చేశారు.
కేసు దర్యాప్తుకి అత్యంత కీలకమైన సాక్ష్యాధారాలను రహస్యంగా ఉంచి అవసరమైనప్పుడు వాటిని న్యాయస్థానానికి అప్పగించాల్సిన బాధ్యత సిట్‌పై ఉందని కానీ ఈ విషయంలో సిట్ అత్యుత్సాహం ప్రదర్శించిందని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. ఇంకా వివిద కారణాల వలన సిట్ ఈ కేసు దర్యాప్తును నిష్పక్షపాతంగా చేయలేదని భావిస్తున్నామని న్యాయమూర్తి ఆ ఆర్డర్ కాపీలో పేర్కొన్నారు.
కనుక జీవో 63తో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌ని, దాని దర్యాప్తుని కూడా రద్దు చేసి, ఈ కేసు(ఎఫ్ఐఆర్: 455/2022)ని సీబీఐకి బదిలీ చేస్తున్నట్లు జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి ఆర్డర్ కాపీలో పేర్కొన్నారు.
గతంలో ఓటుకి నోటు కేసులో కూడా రేవంత్ రెడ్డిని, అనుచరులని ఏసీబీ అధికారులు ట్రాప్ చేసి రెడ్ హ్యాండ్‌గా పట్టుకొన్నప్పుడు ఇలాగే అత్యుత్సాహం ప్రదర్శించి, ఆ వీడియోలను సిఎం కేసీఆర్‌కి అందజేశారు. కొన్ని క్షణాల వ్యవధిలోనే అవి మీడియాకి చేరుకొన్నాయి. అంటే ఇటువంటి కేసులలో కీలక సమాచారాన్ని ముఖ్యమంత్రికి అందజేసి మెప్పు పొందాలని పోలీసులు, వారు అందజేసిన ఆ సాక్ష్యాధారాలతో సిఎం కేసీఆర్ తన ప్రత్యర్ధులను దెబ్బతీయాలని తాపత్రయపడుతున్నట్లు స్పష్టం అవుతోంది.
అందుకే ఈ కేసులో పోలీసులు ఏవిదంగా వ్యవహరించాలో హైకోర్టు ఈ తాజా ఉత్తర్వులలో తెలియజేసింది. అయితే కేంద్ర ప్రభుత్వం కనుసన్నలలో పనిచేసే సీబీఐ తీరు కూడా సిట్‌కి భిన్నంగా ఉండదని అందరికీ తెలుసు. ఇంతవరకు ఈ కేసుతో తెలంగాణ ప్రభుత్వం తన ప్రత్యర్ధులతో ఆటాడుకొంటే, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆటాడుకోబోతోంది. అంతే తేడా!
కనుక పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రశ్నించిన్నట్లు ఈ కేసులో నేరస్తులు ఎవరు?బాధితులు ఎవరు? అనే విషయం తేలాల్సి ఉంది. కానీ దర్యాప్తు సంస్థలను కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు ప్రభావితం చేస్తున్నప్పుడు నేరస్తులకు శిక్షలు పడతాయని ఆశించడం అత్యాసే అవుతుంది కదా?