నలుగురు బిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో బిజెపి ప్రతినిధి నందకుమార్‌తో బేరసారాలు జరిపి చివరికి వారు ముగ్గురినీ తన ఫామ్‌హౌస్‌లో రెడ్ హ్యాండ్‌గా పోలీసులకి పట్టిచ్చిన తాండూర్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి ఈరోజు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.
ఆయన తరపు పిటిషన్ వేసిన న్యాయవాది నిరంజన్ రెడ్డి ఈ కేసులో తన క్లయింట్ రోహిత్ రెడ్డిని ఈడీ విచారణ పేరుతో వేధిస్తోందని, ఆయన ఆస్తులు, లావాదేవీలను తెలుసుకొనే ప్రయత్నం చేస్తోందని వాదించారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బిజెపి ప్రతినిధులు రోహిత్ రెడ్డికి పార్టీతో వందకోట్లు ఇస్తామని చెప్పారు కానీ ఇవ్వలేదని కనుక అటువంటప్పుడు మనీ లాండరింగ్ కింద ఈడీ కేసు నమోదు చేసి విచారణకి పిలుస్తుండటం సరికాదని న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదించారు. ఇది ఈసీఐఆర్ మనీ లాండరింగ్ చట్టానికి విరుద్దం కనుక ఈడీ విచారణని నిలిపివేయాలని కోరారు. కానీ న్యాయస్థానం రోహిత్ రెడ్డి పిటిషన్‌ను తిరస్కరిస్తున్నట్లు ప్రకటించి కేసు తదుపరి విచారణని జనవరి 5వ తేదీకి వాయిదా వేసింది.
ఈ కేసుపై తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసును రెండు కోణాలలో చూడాలి. 1. ఈ కేసులో బిఆర్ఎస్, బిజెపి రెండు పార్టీలు తాము బాధితులమని వాదిస్తున్నాయి. అయితే ఈ కేసులో దోషి ఎవరు?నేరం జరిగింది కనుక దానిని మేమే విచారిస్తామని బిఆర్ఎస్ పట్టుబడుతుండటం ద్వారా ఈ కేసును తనకు అనుకూలంగా మలుచుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు అర్దమవుతోంది.
అసలు నేరమే జరగలేదని వాదిస్తున్న బిజెపి ఈ కేసు దర్యాప్తుని సీబీఐ బదిలీ చేయించుకోవడానికి తహతహలాడింది. బదిలీ కాగానే ఈ కేసు కేంద్రం చేతిలోకి వెళ్ళిన్నట్లయింది. కనుక బిజెపి సంతోషిస్తోంది. అంటే సీబీఐని అడ్డం పెట్టుకొని బిజెపి, సిట్‌ని అడ్డం పెట్టుకొని బిఆర్ఎస్ ఈ కేసును రాజకీయంగా వాడుకోవాలని ప్రయత్నిస్తున్నాయని అర్దమవుతోంది.
నేరం జరిగిందని తేలింది కనుక ఈ కేసులో అసలు దోషులు ఎవరు? వారిని ఎప్పుడు శిక్షిస్తారు? అసలు శిక్షిస్తారా లేక రెండు పార్టీలు కలిసి ఈ కేసును అటకెక్కించేస్తాయా?” అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.