ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా ఈ 8 ఏళ్ళలో తెలంగాణ రాష్ట్రం ఎంతగానో అభివృద్ధి చెందిందనేది వాస్తవం. దేశవిదేశాల నుంచి భారీ పట్టుబడులతో అనేక పరిశ్రమలు, ఐటి కంపెనీలు రాష్ట్రంలో ఏర్పాటవుతున్నాయి. ఆ కారణంగానే దేశంలో అన్ని రాష్ట్రాల నుంచి ప్రజలు ఇప్పుడు హైదరాబాద్ తరలివస్తున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా సమీకృత కలెక్టరేట్ భవనాలు, ప్రభుత్వాసుపత్రులు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, డయాగ్నోస్టిక్ సెంటర్స్, వైద్య కళాశాలలు ఏర్పాటవుతున్నాయి. రోడ్లు, మౌలిక వసతులు, పార్కులు, పచ్చదనం అన్ని ఏర్పడ్డాయి. ఒకప్పుడు సాగునీరు, విద్యుత్ సదుపాయం లేక కటకటలాడిపోయిన వ్యవసాయ రంగానికి ఇప్పుడు పుష్కలంగా నీళ్ళు, ఉచిత విద్యుత్ లభిస్తుండటంతో కేంద్ర ప్రభుత్వం కూడా కొనలేనంత ధాన్యం మన రైతులు పండిస్తున్నారు.
రాష్ట్ర ప్రజలు గర్వపడేలా కొత్త సచివాలయం, పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ వంటివి నిర్మించింది రాష్ట్ర ప్రభుత్వం. ఒకప్పుడు తీవ్ర అవహేళనకి గురైన తెలంగాణ భాష, యాస, సంస్కృతి, పండుగలు, పబ్బాలను ఇప్పుడు దేశవిదేశాలలో కూడా సముచిత గౌరవం లభిస్తుండటంతో తెలంగాణ ప్రజలు గర్వంగా ఆత్మగౌరవంతో తలెత్తుకొని తిరుగుతున్నారు.
75 ఏళ్ళలో సాధ్యంకానీ ఇవన్నీ కేవలం 8 ఏళ్ళలోనే కేసీఆర్ సాధించి చూపారు. తెలంగాణ ప్రజలు గర్వపడేలా చేశారు. ఆయన దూరదృష్టి, పట్టుదల, రాష్ట్రం పట్ల, తన ప్రజలు, భాషా సంస్కృతుల పట్ల అవ్యాజ్యమైన ప్రేమాభిమానాల కారణంగానే ఇవ్వన్నీ చేసి చూపారు.
కేసీఆర్‌లో మరో రాజకీయ కోణం కూడా ఉంది. అదే ఇప్పుడు ఆయనకి, రాష్ట్ర ప్రభుత్వానికి, బిఆర్ఎస్ పార్టీకి, రాష్ట్రానికి కూడా అనేక కొత్త సమస్యలు తెచ్చిపెట్టిందని చెప్పక తప్పదు. పోరాడి సాధించుకొన్న తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళీ కాంగ్రెస్ లేదా మరో పార్టీ చేతిలో పడితే తెలంగాణ రాష్ట్రం ఎక్కడవేసిన గొంగళి అక్కడే ఉండిపోతుందనే ఆలోచన వలన కావచ్చు లేదా తాను కలలగన్న బంగారి తెలంగాణని రూపొందించుకోవడానికి కావచ్చు లేదా తనకు, తన పార్టీకి మాత్రమే తెలంగాణ రాష్ట్రాన్ని పాలించే హక్కులున్నాయని కేసీఆర్ భావించడం వల్ల కావచ్చు… రాష్ట్రంలో ప్రతిపక్షాలను కేసీఆర్ నిర్వీర్యం చేశారు. ఉద్యమకారుడైన కేసీఆర్ రాష్ట్రంలో ఉద్యమాలని, ఆందోళనలని ఉక్కుపాదంతో అణచివేశారు.
ఈ ప్రయత్నంలో ప్రజాస్వామ్యాన్ని, నైతిక విలువలని కూడా పక్కనపెట్టారు. తత్ఫలితంగానే రాష్ట్రంలో ప్రతిపక్షాలు మళ్ళీ బలపడగలిగాయి. ముఖ్యంగా తమలో తాము కీచులాడుకొంటూ కాలక్షేపం చేసే కాంగ్రెస్‌ని కూడా నిర్వీర్యం చేయడంతో దాని స్థానంలో బిజెపి ప్రవేశించింది. కాంగ్రెస్‌ని నిర్వీర్యం చేయడం మొదటి తప్పు కాగా, బిజెపిని రాష్ట్ర స్థాయిలో ఢీకొనకుండా నేరుగా ప్రధాని నరేంద్రమోడీపై కత్తులు దూయడం రెండో తప్పు అని చెప్పక తప్పదు. అదే... తెలంగాణ బిజెపిని రాజకీయంగా ఎదుర్కొంటూ సరిపెడితే తెలంగాణలో కేంద్రం జోక్యం చేసుకోవడానికి ఇంత అవకాశం ఉండేదేకాదని చెప్పవచ్చు.
ఏది ఏమైనప్పటికీ, కేవలం 8 ఏళ్ళలో తెలంగాణ రాష్ట్రాన్ని ఇంతగా అభివృద్ధి చేసినప్పటికీ రాష్ట్రంలో కేసీఆర్‌కి వ్యతిరేకత పెరిగిందని స్పష్టం అవుతోంది. రాష్ట్రంలో బిఆర్ఎస్, బిజెపిల మద్య రాజకీయ ఆధిపత్యపోరులో రెండు పార్టీలు పైచేయి సాధించడానికి తమ ముందున్న అన్ని అవకాశాలను ఉపయోగించుకొంటున్నాయి. తెలంగాణలో తాము తప్ప మరో పార్టీ ఉండకూడదని బిఆర్ఎస్ భావిస్తుండటం, ప్రజలెన్నుకొన్న ప్రజా ప్రభుత్వాన్ని దొడ్డిదారిలో కూల్చేసి అధికారం చేజిక్కించుకోవాలని బిజెపి ప్రయత్నిస్తుండటం రెండూ తప్పే. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమే.
రెండు పార్టీలు ప్రజాస్వామ్యాన్ని గౌరవించకుండా, నైతిక విలువలను పక్కనపెట్టి పోరాడుకొంటున్నందునే వాటికి ఈ దుస్థితి దాపురించిందని చెప్పవచ్చు. అదే... అన్ని పార్టీలు ప్రజాస్వామ్యానికి కట్టుబడి ఉంటే అసలు ఇటువంటి సమస్యలు వచ్చేవే కావు. కానీ ఇప్పుడు ఆ స్టేజి దాటిపోయింది కనుక రాజకీయాలు మరింత దిగజారిపోవడం ఖాయం. దానికి మూల్యం చెల్లించబోయేది ఆ రాజకీయ పార్టీలే!