తెలంగాణకి అప్పులు... బిఆర్ఎస్‌కి ఆదాయం వృద్ధి!

December 27, 2022


img

తెలంగాణ ధనిక రాష్ట్రమని కేసీఆర్‌ చెపుతుంటారు. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం అప్పులు కూడా చేస్తుంటుంది. వాటితో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి సంపద సృష్టించి పేద ప్రజలకి పంచుతున్నామని కేసీఆర్‌ చెపుతుంటారు. కేంద్ర ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తూ రాష్ట్రానికి అప్పు పుట్టకుండా చేస్తోందని దాని వలన ఆర్ధిక పరిస్థితి క్లిష్టంగా మారుతోందని ఆర్ధికమంత్రి హరీష్‌ రావు వంటివారే చెపుతుంటారు.

తెలంగాణ ధనిక రాష్ట్రమని చెప్పుకొంటున్నప్పుడు, వృద్ధిరేటు, తలసరి ఆదాయంలో దేశంలోనే నంబర్ 1 అని చెప్పుకొంటున్నప్పుడు అప్పు పుట్టకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్ధిక ఇబ్బందులు ఎదురవుతున్నాయంటే అర్దం ఏమిటి?అనే సందేహం కలుగుతుంది. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై ఇవన్నీ పొంతనలేని వాదనలే అని మాత్రం అర్దమవుతుంది.   

రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి ఏవిదంగా ఉన్నప్పటికీ ఒకప్పుడు చిల్లిగవ్వ ఆదాయం కూడా లేని బిఆర్ఎస్‌ పార్టీ కేవలం ఈ 8 ఏళ్ళకాలంలో కోట్లకి పడగలెత్తింది. కేంద్ర ఎన్నికల సంఘానికి 2022 సంవత్సరానికి సంబందించి బిఆర్ఎస్‌ సమర్పించిన తాజా ఆడిట్ రిపోర్ట్ ప్రకారం గత ఏడాది మార్చి 31నాటికి బిఆర్ఎస్‌ ఆస్తులు విలువ మొత్తం రూ.253 కోట్లు కాగా 2022 మార్చి 31 నాటికి రూ.451 కోట్లకి పెరిగింది. ఈ ఏడాది ట్రస్టుల ద్వారా రూ.40 కోట్లు, ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా రూ.153 కోట్లు ఆదాయం వచ్చిన్నట్లు ఆడిట్ రిపోర్టులో పేర్కొంది. ఇక రుసుములు, చందాల ద్వారా రూ.8.05 కోట్లు, సాధారణ చందాల ద్వారా రూ.3.75 కోట్లు, ఇతర ఆదాయాలన్నీ కలిపి రూ.16.12 కోట్లు ఆదాయం వచ్చిన్నట్లు పేర్కొంది. 

బిఆర్ఎస్‌ పార్టీకి వివిద మార్గాలలో వచ్చిన ఆదాయాన్ని పోస్టాఫీసులలో ఫిక్స్ డిపాజిట్ రూపంలో భద్రపరుస్తున్నట్లు పేర్కొంది. పోస్టాఫీసులలో రూ.451 కోట్లు ఉన్నట్లు ఆడిట్ రిపోర్టులో పేర్కొంది. ఇది ఆడిట్ నివేదికలో పేర్కొన్నది మాత్రమే. ఇదివరకు సిఎం కేసీఆర్‌ ఓ సభలో ప్రసంగిస్తూ బిఆర్ఎస్‌ పార్టీ కూడా ధనికపార్టీయేనని సుమారు రూ.8-900 కోట్లు ఆస్తులున్నాయని చెప్పారు. 

తెలంగాణ రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయినప్పటికీ, బిఆర్ఎస్‌ ఆస్తులు, ఆదాయం నానాటికీ పెరుగుతూనే ఉండటం విశేషమే కదా? బిఆర్ఎస్‌ ఇంత ధనిక పార్టీ కనుకనే రూ.120 కోట్లు ఖర్చు చేసి కేసీఆర్‌ సొంతంగా విమానం కొనుగోలు చేసి జాతీయ రాజకీయాలలో ప్రవేశించేందుకు సిద్దం అవుతున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.


Related Post