రాష్ట్రపతి హైదరాబాద్‌ పర్యటన... కేసీఆర్‌కి ఇబ్బంది!

December 26, 2022


img

ఏటా శీతాకాలంలో రాష్ట్రపతి హైదరాబాద్‌లోని బొల్లారంలో గల రాష్ట్రపతి నిలయంలో బస చేయడం ఆనవాయితీ. ఆ ప్రకారం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సోమవారం ఉదయం ప్రత్యేక విమానంలో శంషాబాద్‌ విమానాశ్రయం చేరుకొన్నారు. ఆమెకి గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌, రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి సత్యవతి రాథోడ్ స్వాగతం పలికారు. ఆమె విమానాశ్రయం నుంచే ప్రత్యేక హెలికాఫ్టర్‌ నేరుగా శ్రీశైలం వెళ్ళిపోయారు. అక్కడ శ్రీశైల భ్రమరాంబ మల్లిఖార్జున స్వామివారికి ప్రత్యేక పూజలు చేసిన తర్వాత సాయంత్రం 4.15 గంటలకి హకీంపేటకి చేరుకొంటారు. అప్పుడు సిఎం కేసీఆర్‌, మంత్రులు ఆమెకి స్వాగతం పలుకుతారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము గౌరవార్ధం ఈరోజు సాయంత్రం గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ రాజ్‌భవన్‌ విందు ఏర్పాటు చేస్తున్నారు. గత ఏడాదిన్నరగా రాజ్‌భవన్‌కి దూరంగా ఉంటున్న సిఎం కేసీఆర్‌ ఈ ఏడాది జూన్ 22న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు. మళ్ళీ రాజ్‌భవన్‌ గడప తొక్కలేదు. కానీ ప్రోటోకాల్ ప్రకారం నేడు రాజ్‌భవన్‌లో గవర్నర్‌ ఇస్తున్న విందుకు హాజరుకావలసి ఉంటుంది. గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అంటే గిట్టని సిఎం కేసీఆర్‌ ఆమె ఇచ్చే విందులో పాల్గొంటారా లేక మంత్రులను పంపించి మొహం చాటేస్తారో సాయంత్రం తెలుస్తుంది. 

కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయిన తర్వాత యాదాద్రిని అద్భుతంగా తీర్చిదిద్దారు. కానీ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పర్యటన షెడ్యూల్లో యాదాద్రి లేదు. సిఎం కేసీఆర్‌ దూరంగా పెట్టిన త్రిదండి చిన్న జీయర్ స్వామిని కలిసి ముచ్చింతల్‌లో ఆయన నెలకొల్పిన శ్రీ రామానుజస్వామి విగ్రహాన్ని సందర్శిస్తారు. కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయిన తర్వాత  ఏనాడూ భద్రాచలంలో అడుగుపెట్టలేదు కానీ గవర్నర్‌ వెళ్లారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈ నెల 28న అక్కడికి వెళ్ళబోతున్నారు. ఆ తర్వాత మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతమైన ములుగు జిల్లాలో రోడ్డు మార్గంలో  పర్యటించనున్నారు. ఆమె సొంత భద్రతా సిబ్బంది ఎన్ని జాగ్రత్తలు తీసుకొన్నప్పటికీ ఆమె తిరిగి ఢిల్లీకి బయలుదేరి వెళ్ళేవరకు పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. కనుక ఆమె పర్యటించబోయే ప్రాంతాలలో ఆయా జిల్లా పోలీసులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. 

ప్రధాని నరేంద్రమోడీతో, గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌తో సిఎం కేసీఆర్‌ సఖ్యతగా ఉన్నంతకాలం ప్రముఖుల పర్యటనలో ఎటువంటి ఇబ్బందులు లేవు. కానీ ఇప్పుడు కేసీఆర్‌ అందరిపై కత్తులు దూస్తున్నందున, రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పర్యటన కాస్త ఇబ్బందికరంగానే ఉంటుందని చెప్పవచ్చు.      



Related Post