తాండూర్‌లో పైలట్-పట్నం కోల్డ్ వార్!

December 24, 2022


img

తాండూర్‌లో బిఆర్ఎస్‌ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి మద్య కొంతకాలంగా కోల్డ్ వార్ సాగుతోంది. వచ్చే ఎన్నికలలో ఇద్దరూ తాండూర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకోవడమే ఇందుకు కారణం. కనుక తమకే టికెట్‌ దక్కుతుందని ఇద్దరూ చెప్పుకొంటున్నారు. ఇటీవల కేసీఆర్‌ టిఆర్ఎస్‌ విస్తృతస్థాయి సమావేశంలో వచ్చే ఎన్నికలలో కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలకె టికెట్‌ని ఇస్తానని ప్రకటించారని గుర్తు చేస్తున్నారు. బిఆర్ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ముగ్గురు బిజెపి ప్రతినిధులను రెడ్ హ్యాండ్‌గా పట్టించి పార్టీ పేరు, సిఎం కేసీఆర్‌ పేరు దేశమంతా మారుమోగిపోయేలా చేశానని చెప్పుకొంటున్నారు. ఈవిషయం కేసీఆర్‌ స్వయంగా చెప్పారని కనుక తనకే టికెట్‌ ఖాయమని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి చెప్పుకొంటున్నారు.

ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం బయటపడిన తర్వాత రోహిత్ రెడ్డితో సహా నలుగురు ఎమ్మెల్యేలని సుమారు 20 రోజులు ప్రగతి భవన్‌లో ఉంచడంతో వారికి సిఎం కేసీఆర్‌తో సాన్నిహిత్యం పెరిగింది. ప్రగతి భవన్‌ నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి రోహిత్ రెడ్డి ‘పల్లె పల్లెకి పైలట్’ పేరుతో తన నియోజకవర్గంలో గ్రామాలలో పర్యటిస్తూ ప్రజలతో మమేకం అవుతున్నారు. ఇవన్నీ చూస్తున్న నియోజకవర్గంలో బిఆర్ఎస్‌ కార్యకర్తలు ఈసారి రోహిత్ రెడ్డికే టికెట్‌ ఖాయమని నమ్ముతుండటంతో మెల్లమెల్లగా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి శిబిరంలో నుంచి రోహిత్ రెడ్డి వైపు వచ్చేస్తున్నారు. 

దీంతో పట్నం మహేందర్ రెడ్డి తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రోహిత్ రెడ్డి తనను రాజకీయంగా దెబ్బతీసి ఎదగాలని చూస్తున్నారని ఇది సరికాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకాలం బిఆర్ఎస్‌ వైపున్న నియోజకవర్గంలో ప్రజలు, కార్యకర్తల మద్య రోహిత్ రెడ్డి గందరగోళం సృష్టిస్తూ పార్టీకి తీరని నష్టం కలిగిస్తున్నారని ఆరోపిస్తున్నారు. రోహిత్ రెడ్డి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా నియోజకవర్గంలో   అందరూ తనవెంటే ఉన్నారని కనుక తనకే టికెట్‌ ఖాయమని పట్నం మహేందర్ రెడ్డి చెప్పుకొంటున్నారు. 

ఒక నియోజకవర్గంలో ఒకే పార్టీకి చెందిన ఇద్దరు బలమైన నేతల మద్య ఈవిదంగా కోల్డ్ వార్ జరిగితే ఇద్దరిలో ఎవరో ఒకరూ నష్టపోక తప్పదు. అప్పుడు ఆ వ్యక్తిని ఆకర్శించేందుకు బిజెపి తప్పక ప్రయత్నిస్తుంది. కనుక వారి మద్య జరుగుతున్నా కోల్డ్ వార్ వలన బిజెపికి కూడా లాభం కలిగే అవకాశం ఉందన్న మాట! కనుక కేసీఆర్‌ పార్టీకి, వారిద్దరికీ నష్టం కలగకుండా ఏవిదంగా కాపాడుకోంటారో చూడాలి. 


Related Post