తెలంగాణలో మళ్ళీ టిడిపిని బలోపేతం చేయాలనే చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు ఫలించవని బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అధ్వర్యంలో బుదవారం సాయంత్రం ఖమ్మంలో టిడిపి శంఖారావం బహిరంగసభలో జరిగింది.
దానిపై విలేఖరులు అడిగిన ప్రశ్నకు కల్వకుంట్ల కవిత బదులిస్తూ, “ఆకాశంలో నక్షత్రాలు ఎన్ని ఉన్నా ఒకే చంద్రుడు ఉన్నట్లు రాష్ట్రంలో ఎన్ని పార్టీలున్నా కేసీఆర్ ఒక్కరే ప్రజానాయకుడు. టిడిపి తెలంగాణ రాష్ట్రానికి చేసిందేమీ లేదు కనుకనే ప్రజలు ఇదివరకే దానిని తిరస్కరించారు. కనుక తెలంగాణలో టిడిపిని పునరుద్దరించాలనే చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు ఫలించవు,” అని అన్నారు.
దశాబ్ధాలుగా అభివృద్ధికి నోచుకోక తీవ్ర వివక్షకి గురైన తెలంగాణని సముచిత గౌరవం కల్పించి, రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసి చూపుతున్నందున తెలంగాణ ప్రజలు కేసీఆర్‌ని, బిఆర్ఎస్ పార్టీని ఎంతగానో ఆదరిస్తున్నారు. అయితే అభివృద్ధి ఒక్కటే ఏ పార్టీని గెలిపించలేదు. గెలిపిస్తుందనుకొంటే జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో బిజెపికి అన్ని సీట్లు దక్కేవే కావు.
సాధారణంగా ప్రభుత్వం పట్ల కొంతమంది ప్రజలలో వ్యతిరేకత ఉంటుంది. అదే సమయంలో అధికార పార్టీ రాజకీయంగా చేసే తప్పులు లేదా వైఫల్యాలు, ప్రతిపక్షాల రాజకీయాలు, ముఖ్య నేతల పార్టీల ఫిరాయింపులు, ఎన్నికల వ్యూహాలు, పోల్ మేనేజిమెంట్ వంటి పలు అంశాలు ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేస్తాయని అందరికీ తెలుసు.
గత రెండు ఎన్నికలతో పోలిస్తే ఇప్పుడు రాష్ట్రంలో బిజెపి బలపడింది. కనుక వచ్చే ఎన్నికలలో టిఆర్ఎస్‌కి గట్టిపోటీ ఉంటుంది. ఇటువంటి రాజకీయ పరిస్థితులున్నప్పుడే ఇతర పార్టీలకి కూడా అవకాశం లభిస్తుంది. అందుకే వైఎస్సార్ తెలంగాణ, జనసేన, టిడిపి కూడా తమకి పట్టున్న ప్రాంతాలలో బలం పెంచుకొని పోటీ చేసేందుకు సిద్దం అవుతున్నాయని చెప్పవచ్చు.
ఆయా పార్టీల నేతల సభలకి భారీగా జనం తరలివస్తుండటం గమనిస్తే వాటికి ఎంతో కొంత పట్టుందని స్పష్టం అవుతోంది. కనుక అవి రాష్ట్రంలో అధికారంలోకి రాలేకపోయినా తప్పకుండా ఓట్లు చీల్చి బిఆర్ఎస్ విజయావకాశాలను దెబ్బతీయగలవు. ఇంకా అవకాశం వస్తే ఎన్నికల తర్వాత ప్రభుత్వ ఏర్పాటులో చక్రం తిప్పగలవు కూడా. కనుక టిడిపి ప్రయత్నాలను అంత తేలికగా కొట్టిపడేయలేము.