సినీ పరిశ్రమకి మళ్ళీ కరోనా కష్టాలు మొదలవుతయా?

December 22, 2022


img

దేశంలో మళ్ళీ కరోనా మహమ్మారి వ్యాపించే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం తాజా హెచ్చరికలను ప్రజలు పెద్దగా పట్టించుకొన్నట్లు లేరు కానీ ఈ తాజా హెచ్చరిక ఐ‌టి కంపెనీలు, పరిశ్రమలు, మార్కెట్లు, షాపింగ్ మాల్స్, రైలు, రోడ్డు రవాణా సంస్థలకి, విమానయాన సంస్థలకి మరీ ముఖ్యంగా సినీ పరిశ్రమకి ఆందోళన కలిగించేదే అని చెప్పవచ్చు. 

వరుసగా రెండేళ్ళు దేశాన్ని పట్టి పీడించిన కరోనా దెబ్బకి దాదాపు అన్ని రంగాలు తీవ్రంగా నష్టపోయాయి. అతికష్టం మీద కోలుకొని మళ్ళీ ఇప్పుడిప్పుడే నిలద్రొక్కుకొంటుంటే కరోనా మహమ్మారి మరోసారి దెబ్బతీస్తుందనే భయం అన్ని వర్గాలలో మొదలైంది. 

తెలుగు సినీ పరిశ్రమ విషయానికి వస్తే, ఇప్పుడు కనీసం రూ.100-150 కోట్లు పెట్టుబడితో పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు తీస్తున్నారు. ప్రభాస్‌ సినిమాలన్నీ రూ.400 కోట్లు పైబడే ఉంటున్నాయి. మీడియం బడ్జెట్‌ సినిమాలు కూడా రూ.30-50 కోట్లు వరకు ఉంటున్నాయి. కనుక మళ్ళీ కరోనా విరుచుకు పడితే సినిమా షూటింగ్ మొదలు రిలీజ్‌ వరకు అడుగడుగునా ఇబ్బందులు, ఆలస్యం తప్పదు. దాంతో బడ్జెట్‌ పెరిగిపోయి సకాలంలో సినిమా విడుదల కాకపోతే నష్టాలు కూడా వస్తాయి. 

సంక్రాంతి పండుగకి చిరంజీవి నటించిన వాల్తేర్ వీరయ్య, బాలకృష్ణ నటించిన వీరసింహా రెడ్డి, విజయ్‌ నటించిన వారసుడు, అజిత్ నటించిన తెగింపు మొదలు వేసవి సెలవుల వరకు అనేక చిన్నా పెద్ద సినిమాలు క్యూలో ఉన్నాయి. 

నిన్న కేంద్ర ప్రభుత్వం కరోనా గురించి హెచ్చరిస్తున్నప్పుడు దేశంలో మూడే మూడు కొత్త వేరియంట్ కేసులు నమోదు కాగా ఈరోజు వాటి సంఖ్య 42కి పెరిగినట్లు సమాచారం. కనుక సంక్రాంతి పండుగ సమయానికి రెండు తెలుగు రాష్ట్రాలలో కరోనా కేసులు పెరిగిపోతే తమ సినిమాల విడుదలకి చాలా ఇబ్బంది ఏర్పడుతుందని దర్శకనిర్మాతలు ఆందోళన చెందుతున్నారు. కరోనా ఆంక్షల పేరుతో మళ్ళీ 50 శాతం సీటింగ్‌తో సినిమాలు ప్రదర్శించుకోవడానికి అనుమతించినా ఎవరికీ గిట్టుబాటు కాదు. కనుక కరోనా పేరు వింటేనే తెలుగు సినీ పరిశ్రమ ఉలిక్కి పడుతోంది. 


Related Post