మంత్రి మల్లారెడ్డికి కేసీఆరే పొగపెడుతున్నారా?

December 20, 2022


img

ఇటీవల సుమారు 400 మంది ఆదాయపన్ను శాఖ అధికారులు మంత్రి మల్లారెడ్డి, ఆయన కుమారులు, బంధువుల ఇళ్ళు, కార్యాలయాలు, వారి కాలేజీలపై రెండు రోజులపాటు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మల్లారెడ్డి, కుమారులు  డొనేషన్స్ పేరుతో విద్యార్థుల నుంచి సుమారు రూ.100 కోట్లు వసూలు చేశారని ఆరోపిస్తూ ఐ‌టి అధికారులు మల్లారెడ్డి కుమారుడి చేత దానికి సంబందించిన పత్రాలపై సంతకం చేయించుకొని వెళ్ళారు. అందుకు మంత్రి మల్లారెడ్డి ఐ‌టి అధికారులపై చిందులు వేశారు. పోలీస్ కేసు కూడా పెట్టారు. ఇటువంటి తాటాకు చప్పుళ్ళకి తాను భయపడబోనని మేకపోతు గాంభీర్యం ప్రదర్శించారు కూడా. 

అయితే ఆ దాడుల ప్రధానోద్దేశ్యం ఆయనని బిఆర్ఎస్‌లో నుంచి బిజెపిలోకి రప్పించడమే అనేది బహిరంగ రహస్యం. ఈ ఆదాయపన్ను కేసుల్లో ఇరుకొంటే ఇంతకాలం కష్టపడి పోగేసిన వందల కోట్ల ఆస్తులన్నీ చూస్తుండగానే కరిగిపోయే ప్రమాదం ఉంటుంది. కనుక మల్లారెడ్డి బిజెపిలో చేరేందుకు సిద్దపడుతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆయన వెళ్లిపోవడం ఖాయమని గ్రహించినందునే సిఎం కేసీఆర్‌ బిఆర్ఎస్‌ ఎమ్మెల్యేల ద్వారా ఆయనకి పొగపెట్టిస్తున్నారనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. 

రాజకీయంగా చెప్పుకోవాలంటే శాస్త్ర బద్దంగా పార్టీలో నుంచి బయటకి పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పుకోవచ్చు. ఆనాడు అసైన్డ్ భూముల కుంభకోణం వంకతో ఈటల రాజేందర్‌ని ఏవిదంగా పార్టీలో నుంచి బయటకి పంపించేరో ఇప్పుడూ అదేవిదంగా టిఆర్ఎస్‌ ఎమ్మెల్యేల చేత అసమ్మతి రాగాలు తీయించి మల్లారెడ్డిని బయటకి పంపేందుకు సిఎం కేసీఆర్‌ ఏర్పాట్లు చేస్తున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇవి నిజమవుతాయా కాదా అనేది రాబోయే రోజుల్లో ఎలాగూ తేలిపోతుంది కనుక బిఆర్ఎస్‌లో మంత్రి మల్లారెడ్డి ఎపిసోడ్ ఏవిదంగా ముగుస్తుందో అంతవరకు వేచి చూడక తప్పదు.


Related Post