కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా మల్లిఖార్జున ఖర్గే ఎన్నికైనప్పటికీ ఆ పార్టీకి మకుటం లేని రాజు రాహుల్ గాంధీయే. భారత్ జోడో యాత్రలో ఆయన వెనక సీనియర్ నేతలు పరుగులు తీస్తుండటం చూస్తే ఈ విషయం అర్దం అవుతుంది. రాహుల్ గాంధీ తెలంగాణ గడప దాటక మునుపే మునుగోడు ఉపఎన్నికలలో కాంగ్రెస్ ఓడిపోయింది. ఆయన తెలంగాణ దాటిన కొన్ని రోజులకే రాష్ట్ర కాంగ్రెస్‌లో కుమ్ములాటలు మొదలై రేవంత్ రెడ్డి వర్గం, సీనియర్లు రెండు వర్గాలుగా చీలిపోయి కీచులాడుకోవడం మొదలుపెట్టాయి. సీనియర్లలో కొంతమంది తమ పార్టీ పదవులకి రాజీనామాలు కూడా చేశారు. వారిలో కొంతమంది బిజెపి వైపు చూస్తున్నట్లు తాజా సమాచారం.
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దానిలో నేతలు పదవులు, అధికారం కోసం కీచులాడుకొంటే అర్దం ఉండేది. కానీ ఓ పక్క రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నానాటికీ బలహీనపడి కనుమరుగయ్యే పరిస్థితికి చేరుకొంటుంటే, పార్టీలో నేతలు పదవుల పేరుతో రేవంత్ రెడ్డిపై తిరుగుబాటు చేయడం విశేషం.
కాంగ్రెస్ సీనియర్ నేతలలో ఏ ఒక్కరికీ పార్టీ పగ్గాలు చేపట్టి కేసీఆర్, బిజెపిలని ధీటుగా ఎదుర్కొని పోరాడే శక్తి, గుండె ధైర్యం లేవు కనుకనే కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డికి పార్టీ పగ్గాలు అప్పగించిందని భావించవచ్చు. అందుకే పార్టీలో సీనియర్లు రేవంత్ రెడ్డిని ఇంతగా ద్వేషిస్తున్నారనుకోవచ్చు. రేవంత్ రెడ్డిపై ప్రతీకారం తీర్చుకొనేందుకు సీనియర్ నేతలందరూ కలిసి మునుగోడు ఉపఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని ఓడించుకోవడానికి కూడా వెనుకాడలేదు! పార్టీ కంటే పదవులు, ప్రతీకారాలే ముఖ్యమనుకొనే కాంగ్రెస్ నేతలు కూర్చొన్న చెట్టు కొమ్మని నరుకొంటున్నారని చెప్పవచ్చు.
రేవంత్ రెడ్డి రాష్ట్ర కాంగ్రెస్ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి సీనియర్లని కలుపుకుపోవాలని చాలా ప్రయత్నించారు. కానీ వారు ఆయనని దూరంపెట్టి పార్టీలో ఒంటరిని చేశారు. అయినప్పటికీ రేవంత్ రెడ్డి ఒంటరిపోరాటం చేస్తూనే ఉన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కుప్పకూలిపోతుంటే జాతీయ అధ్యక్షుడు ఖర్గే కానీ, దేశాన్ని జోడిస్తానంటూ హుషారుగా పాదయాత్ర చేసుకుపోతున్న మకుటంలేని మారాజు రాహుల్ గాంధీ గానీ పట్టించుకోవడం లేదు. కనుక ఆయన భారత్ జోడో యాత్ర పూర్తయ్యేలోగా తెలంగాణలో కాంగ్రెస్ రెండుగా చీలి కనబడకుండా అదృశ్యమవుతుందేమో?