కాంగ్రెస్ పార్టీ గొప్పదనం ఏమిటంటే దానిని ఎవరూ ఓడించనక్కరలేదు. తనని తానే ఓడించుకొని ఎదుటవాళ్ళకి అవకాశం ఇచ్చి పక్కకు తప్పుకొంటుంది. మరో గొప్ప విషయం ఏమిటంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందా ప్రతిపకక్షంలో ఉందా అనే దాంతో కూడా ఆ పార్టీ నేతలకి సంబందం లేకుండా నిత్యం పదవుల కోసమో లేదా గ్రూపు రాజకీయాలు చేసుకొంటూనో బిజీగా ఉంటారు. కనుక వారికి మరో పార్టీ గురించి ఆలోచించే తీరికే ఉండదు.
అపర చాణక్యుడని పేరు గాంచిన సిఎం కేసీఆర్ ఈ రెండు చిన్న విషయాలను మరిచి గంగిగోవు వంటి కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేసి దాని స్థానంలో గాండ్రించే పులి వంటి బిజెపిని తెచ్చిపెట్టుకొని ఇప్పుడు తాపీగా ఇబ్బంది పడుతున్నారు. అది వేరే సంగతి!
పైన చెప్పుకొన్నా రెండు సిద్దాంతాల ప్రకారం, తెలంగాణ కాంగ్రెస్‌లో సీనియర్ నేతలందరూ నేడు సిఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క నివాసంలో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజానరసింహ, మధూ యాష్కీ, కోదండరెడ్డి, జగ్గారెడ్డి, మహేశ్వర్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు పాల్గొన్నారు. ఇటీవల ప్రకటించిన కాంగ్రెస్ కమిటీల పట్ల, రేవంత్ రెడ్డి తీరు పట్ల వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సీనియర్లమైన తమని పక్కన పెట్టి ఇతర పార్టీలలో నుంచి వచ్చినవారికి ఆ కమిటీలలో చోటు కల్పించడాన్ని వారు తప్పు పట్టారు. పైగా తమలో కొందరు కోవర్టులు ఉన్నారంటూ మాట్లాడటాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. అసలు సిసలైన కాంగ్రెస్ తమదే అని వారు ప్రకటించారు. బయట నుంచి ఈ వలస పక్షుల నుంచి కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవడం కోసమే తాము భేటీ అయ్యామని చెప్పారు.