భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బిజెపిలో చేరేందుకు ముహూర్తం ఖరారు చేసుకొంటున్నారా? అంటే అవుననే చెప్పుకోవాల్సి ఉంటుంది. పార్లమెంట్ సమావేశాలతో చాలా బిజీగా ఉన్న ప్రధాని నరేంద్రమోడీతో భేటీకి అపాయింట్మెంట్ కోరగా ఆయన వెంటనే 25 నిమిషాల సేపు సమయం కేటాయించి పార్లమెంటులోనే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో భేటీ కావడం విశేషం. తాను రాష్ట్రానికి సంబందించిన పలు అభివృద్ధి పనుల గురించి మాత్రమే ప్రధానితో చర్చించనని వెంకట్ రెడ్డి చెప్పుకొన్నప్పటికీ, బిజెపిలో చేరేందుకు ముహూర్తం ఖరారు చేసుకొనేందుకే కలిసినట్లు అర్దం అవుతోంది.
నిజానికి ఆయన బిజెపిలో చేరబోతున్నారంటూ బండి సంజయ్ ఇదివరకే ప్రకటించి మళ్ళీ ఇప్పుడే కాదని సవరణ ప్రకటన చేశారు. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్ష పదవి లభించకపోవడంతో తీవ్ర అసంతృప్తిగా ఉన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అప్పటి నుంచే బిజెపిలో చేరేందుకు ఎదురుచూస్తున్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీకి ఎంతో కీలకమైన మునుగోడు ఉపఎన్నికల సమయంలోనే ఆయన పార్టీకి హ్యాండ్ ఇచ్చి బిజెపిలో చేరిన తన తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మద్దతు ప్రకటించారు. బిజెపి అభ్యర్ధిగా పోటీ చేసిన తన తమ్ముడిని గెలిపించుకోవడానికి, కాంగ్రెస్ ఓటమికి పరోక్షంగా చేయగలిగినంతా చేశారు. అందుకు కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ఆయనకి షో-కాజ్ నోటీస్ కూడా ఇచ్చింది. ఆ తర్వాత ఏర్పాటు చేసిన కాంగ్రెస్ కమిటీలలో ఆయనకి స్థానం కల్పించలేదు.
కనుక తాను ఇప్పుడు స్వేచ్ఛాజీవిని అయ్యానని, ఇప్పుడు తాను ఏం చేయాలనుకొంటే అది చేయగలనని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ఇక వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు నల్గొండ జిల్లాలో బిజెపికి బలమైన అభ్యర్ధులు లేరు. కనుక కోమటిరెడ్డి సోదరులిద్దరినీ పార్టీలో చేర్చుకొని ఆ లోటుని భర్తీ చేసుకోవాలనుకొంటోంది. ఇప్పటికే రాజగోపాల్ రెడ్డిని చేర్చుకొంది. ఇప్పుడు వెంకట్ రెడ్డిని కూడా చేర్చుకొనేందుకు సిద్దం అవుతున్నట్లుంది. అందుకే ఆయన అడగగానే ప్రధాని నరేంద్రమోడీ 25 నిమిషాలు సమయం కేటాయించి భేటీ అయ్యారనుకోవచ్చు.
అయితే వెంకట్ రెడ్డిపై వేటు వేస్తే ఆయన వెంటనే బిజెపిలో చేరిపోతారనే భయంతోనే కాంగ్రెస్ పార్టీ ఆయనకి షోకాజ్ నోటీస్ ఇచ్చినా వేటువేయడానికి వెనకాడుతోందని చెప్పవచ్చు. కనుక కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు తనపై బహిష్కరణ వేటు వేస్తుందా అని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎదురు చూస్తున్నారు. ఒకవేళ వేటు వేస్తే వెంటనే బిజెపిలో చేరిపోవడానికి వీలుగా ముందస్తు ఏర్పాట్లు చేసుకొంటున్నట్లున్నారు. కనుక బంతి కాంగ్రెస్ కోర్టులోనే ఉన్నట్లు భావించవచ్చు.