పొరుగు రాష్ట్రంలో ఏపీలో జగన్మోహన్ రెడ్డితో విభేదించిన వైఎస్ షర్మిల తెలంగాణ రాజకీయాలలో ప్రవేశించి ఇక్కడ తన అదృష్టం పరీక్షించుకోవాలనుకొంటున్నారు. దాదాపు ఏడాదిగా ఆమె రాష్ట్రంలో పాదయాత్ర చేస్తూ ప్రజలని ఆకట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆమె ప్రయత్నాలు ఫలించడం లేదనే చెప్పాలి. ఆమె నిత్యం తెలంగాణ సిఎం కేసీఆర్‌ని ఆయన ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నప్పటికీ, తెలంగాణ ప్రభుత్వం, ప్రజలు కూడా చాలా సహనం ప్రదర్శిస్తూ ఆమెకి ఎటువంటి ఇబ్బందీ కలుగకుండా చూసుకొంటున్నారు.
కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రంలో అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుంటే ఆమె తన తండ్రి రాజన్న రాజ్యం స్థాపిస్తే కానీ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందదని వాదిస్తుండటం విశేషం. ఆమె సోదరుడు జగన్మోహన్ రెడ్డి గత మూడున్నరేళ్ళుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజన్న రాజ్యమే నడిపిస్తూ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేశారు. కనుక వైఎస్ షర్మిల కూడా తెలంగాణ రాజన్న రాజ్యం స్థాపిస్తానని చెపుతుండటం ఆశ్చర్యం కలిగిస్తుంది.
బిఆర్ఎస్‌ని ఢీకొనడం కాంగ్రెస్, బిజెపిల వల్లనే కావడం లేదు. ఇక ఆమె వల్ల ఏమవుతుంది?అని ఆలోచిస్తే ఆమె తన రాజకీయ ఎదుగుదల కోసం కాక ఎన్నికల సమయంలో ఓట్లు చీల్చి రాష్ట్రంలో మరో పార్టీకి పరోక్షంగా మేలు చేసే ఉద్దేశ్యంతోనే రాజకీయాలు చేస్తున్నట్లు అర్దమవుతుంది. అందుకే ఆమె ఎవరు వదిలిన బాణం? అనే చర్చ నడుస్తూనే ఉంది. ఆ విషయం ఎన్నికలు సమీపించినప్పుడు ఎలాగూ బయటపడుతుంది. కనుక అదిప్పుడు అప్రస్తుతం.
ఆమె ఈరోజు ఖమ్మం బైపాస్ రోడ్డులో కరుణగిరి చర్చి సమీపంలో తన వైఎస్సార్ తెలంగాణ పార్టీ కార్యాలయం నిర్మించడానికి తల్లి విజయమ్మతో కలిసి శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా విజయమ్మ ప్రజలని ఉద్దేశ్యించి మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం తన బిడ్డని ఎంతగా వేదిస్తున్నప్పటికీ ఆమె ప్రజల కోసం పోరాడుతూనే ఉందని కనుక తన బిడ్డని అందరూ ఆశీర్వదించాలని కోరారు. అయితే తెలంగాణ ప్రజలకి వైఎస్ షర్మిల నాయకత్వం అవసరమా? ఏపీలో రాజన్న రాజ్యం ఎలా ఉందో కళ్లెదుటే కనబడుతుండగా మళ్ళీ తెలంగాణలో కూడా రాజన్న రాజ్యం అవసరముందా?