తెలంగాణ కాంగ్రెస్‌లో విచిత్రం... ఖర్గేతో వెంకట్ రెడ్డి భేటీ!

December 14, 2022


img

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మునుగోడు షాక్ నుంచి ఇంకా తేరుకొనేలేదు ఆ పార్టీలో అనూహ్యమైన పరిణామాలు జరుగుతున్నాయి. ఇటీవల ప్రకటించిన కాంగ్రెస్‌ కమిటీలపై పార్టీలో కొండా సురేఖ వంటివారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ గొడవ ఇంకా కొనసాగుతుండగానే సైబర్ క్రైమ్ పోలీసులు మాదాపూర్‌లో ఉన్న కాంగ్రెస్‌ వార్ రూమ్‌లో సోదాలు నిర్వహించి కొన్ని కంప్యూటర్లు, వాటిలో పార్టీకి సంబందించిన విలువైన డేటాని స్వాధీనం చేసుకొని పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలుని అరెస్ట్ చేశారు. 

మునుగోడు ఉపఎన్నికలలో పార్టీని దెబ్బ తీసినందుకు కాంగ్రెస్‌ పార్టీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి షోకాజ్ నోటీస్ పంపిస్తే దానిని ఆయన పట్టించుకోలేదు. అయినా కాంగ్రెస్ పార్టీ ఆయనపై వేటు వేసేందుకు ధైర్యం చేయలేకపోతోంది. షో-కాజ్ నోటీస్ అందుకొన్న ఆయనతో కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే సుదీర్గంగా భేటీ అవడం మరో విశేషం. 

రాష్ట్ర కాంగ్రెస్‌ ఆయనకి నోటీస్ ఇచ్చినప్పుడు జాతీయ అధ్యక్షుడు దానిని గౌరవించి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని దూరంగా ఉంచి ఉంటే రాష్ట్ర కాంగ్రెస్‌కి ఏమైనా విలువా, గౌరవం ఉండేది. కానీ ఆయనతో భేటీ అవడమే కాకుండా రాష్ట్ర కాంగ్రెస్‌ పనితీరు గురించి అడిగి తెలుసుకొన్నారు. మునుగోడు ఉపఎన్నికలలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని అభ్యర్ధిని ఎంత ఘోరంగా దెబ్బ తీశారో అందరికీ తెలుసు. అటువంటి వ్యక్తిని మల్లిఖార్జున ఖర్గేతో భేటీ అవడం ద్వారా రాష్ట్ర కాంగ్రెస్‌లో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్లు తప్పుడు సంకేతాలు పంపారని చెప్పవచ్చు. కాంగ్రెస్ పార్టీకి నాయకత్వలోపం ఎలాగూ ఉండనే ఉంది. అది సరిపోదన్నట్లు ఇప్పుడు ఈవిదంగా వ్యవహరిస్తే రాష్ట్ర కాంగ్రెస్‌ ఏవిదంగా కోలుకోగలదు? 


Related Post