వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాదయాత్రకి అనుమతి కోరుతూ ఈరోజు దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్‌పై హైకోర్టు సానుకూలంగా స్పందిస్తూ అనుమతి మంజూరు చేసింది. ఈ సందర్భంగా హైకోర్టులో ఆసక్తికరమైన చిన్న చర్చ సాగింది. “హైకోర్టు అనుమతించిన తర్వాత కూడా పోలీసులు ఆమె పాదయాత్రకి అనుమతి ఎలా నిరాకరించారని న్యాయమూర్తి ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించారు.
ప్రభుత్వ న్యాయవాది జవాబిస్తూ, “తెలంగాణ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని కించపరిచేవిదంగా మాట్లాడవద్దని, ఎవరినీ రెచ్చగొట్టేవిదంగా మాట్లాడవద్దనే షరతులతో ఇంతకు ముందు హైకోర్టు అనుమతించింది. కానీ వైఎస్ షర్మిల రాజ్‌భవన్ బయటకి రాగానే తెలంగాణ ప్రభుత్వాన్ని తాలిబాన్ ప్రభుత్వమని, ముఖ్యమంత్రిని తాలిబన్ల నాయకూడని కించపరుస్తూ మాట్లాడారు. అందుకే ఆమె పాదయాత్రకి పోలీసులు అనుమతి నిరాకరించారు,” అని తెలిపారు.
అప్పుడు న్యాయమూర్తి స్పందిస్తూ, “ఆమె వరంగల్‌లో పర్యటిస్తున్నప్పుడు ఆవిదంగా అని ఉంటే ఆమె పాదయాత్రకి అనుమతి నిరాకరించినా అర్దం ఉంటుంది. కానీ హైదరాబాద్‌లో మాట్లాడినప్పుడు ఎలా అనుమతి నిరాకరిస్తారు? అయినా ఇటీవల ప్రతిపక్ష పార్టీలు పాదయాత్రల కోసం హైకోర్టు చుట్టూ తిరగవలసిరావడాన్ని ఏమనుకోవాలి?” అని ప్రశ్నించారు.
తర్వాత... పాదయాత్రకి అనుమతి కోరుతూ ఆమె మళ్ళీ వరంగల్ పోలీసులకి దరఖాస్తు చేసుకోవాలని, పోలీసులు ఆమె పాదయాత్రకి అనుమతి మంజూరు చేయాలని న్యాయమూర్తి సూచించారు. అయితే ఇప్పుడు కూడా పాత షరతుల ప్రకారమే అనుమతిస్తున్నామని స్పష్టం చేశారు.
అంటే వైఎస్ షర్మిలని నోరు అదుపులో పెట్టుకొని పాదయాత్ర చేసుకోమని చెప్పినట్లే భావించవచ్చు. కానీ కేసీఆర్‌ని విమర్శించకూడదనుకొంటే ఆమె పాదయాత్ర చేసి ప్రయోజనమే ఉండదు. అంతకంటే ఇంట్లో కూర్చొని తెలుగు సీరియల్స్ చూసుకోవడమే మేలు. కేసీఆర్‌ని విమర్శించడం ద్వారానే ఆమె అందరి దృష్టిని ఆకర్షించాలని తపిస్తున్నప్పుడు ఆమె ఏవిదంగా నోరు కట్టుకొని పాదయాత్ర చేస్తారు?
కనుక పాదయాత్ర మొదలుపెట్టగానే ఆమె మళ్ళీ నోటికి పనిచెప్పడం ఖాయం. అప్పుడు పోలీసులు ఆమెని అడ్డుకోవడం ఖాయమే. అప్పుడు ఆమె మళ్ళీ హైదరాబాద్‌లో ఆమరణదీక్షో లేదా ప్రగతి భవన్ వద్ద నిరసన డ్రామా రక్తి కట్టించడం కూడా ఖాయమే. కనుక ఈ కధ ఎప్పటికీ ఏవిదంగా ముగుస్తుందో ఊహించడం కష్టమే.