టిఆర్ఎస్‌కి వ్యూహాలున్నప్పుడు బిజెపికి ఉండవా?

December 13, 2022


img

రాష్ట్ర స్థాయిలో రాజకీయంగా బిఆర్ఎస్‌కి ఎదురులేకుండా చూసుకొనేందుకు సిఎం కేసీఆర్‌ అనేకానేక వ్యూహాలు అమలుచేస్తుంటారు. “బంగారి తెలంగాణ సాధన కోసం రాజకీయ పునరేకీకరణ” పేరుతో రాష్ట్రంలో ప్రతిపక్షాల ఎమ్మెల్యేలను, ముఖ్య నేతలను బిఆర్ఎస్‌లోకి ఆకర్షించి వాటిని నిర్వీర్యం చేయాయడం అందుకు ఓ ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇక ఎన్నికల సమయంలో విజయం సాధించేందుకు అనేక ప్రత్యేక వ్యూహాలు అమలుచేస్తుంటారు. దళిత బంధు వంటి కొత్త పధకాలు ప్రకటిస్తుంటారు. పోలింగ్ జరుగుతున్న సమయంలో ప్రతిపక్ష అభ్యర్ధి తమ పార్టీతో భేటీ అయ్యారంటూ సోషల్ మీడియాలో పుకార్లు పుట్టించడం ఆ వ్యూహాలలో భాగమే అని చెప్పవచ్చు. 

కనుక బిఆర్ఎస్‌కి ఏవిదంగా వ్యూహాలు ఉంటాయో, తెలంగాణలో అధికారం చేజిక్కించుకోవాలనుకొంటున్న బిజెపికి, దాని వెనుకున్న కేంద్రానికి కూడా ఏవో వ్యూహాలు ఉంటాయి. వాటిని అమలుచేసి విజయం సాధించాలనుకొంటాయి. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్‌ వ్యూహాల పేరుతో అప్రజాస్వామిక, అనైతిక మార్గాలలో ముందుకు వెళుతున్నప్పుడు, జాతీయస్థాయిలో  బిజెపిని దాని వెనుక కేంద్రాన్ని మడికట్టుకొని కూర్చోవాలని ఆశించడం అత్యసే అవుతుంది కదా?

కనుక కేంద్ర ప్రభుత్వం కూడా తన చేతిలో ఉన్న ఐ‌టి, ఈడీ, సీబీఐ వంటి అస్త్రశస్త్రాలను కేసీఆర్‌ ప్రభుత్వం మీద ప్రయోగిస్తోందని భావించవచ్చు. అప్పుడు కేసీఆర్‌ కూడా వాటిని తనదైన శైలిలో ధీటుగానే ఎదుర్కొంటున్నారు. తెలంగాణ ప్రజలలో బిజెపి పట్ల ద్వేషం, అపనమ్మకం పెంచేలా చేస్తుండటం, టిఆర్ఎస్‌ని బిఆర్ఎస్‌గా మార్చి మోడీ ప్రభుత్వాన్ని కట్టడి చేయడానికి ప్రయత్నిస్తుండటం ఆ ప్రయత్నాలలో భాగమే అని చెప్పవచ్చు. ఇక టిఆర్ఎస్‌తో పాటు కల్వకుంట్ల కవిత అధ్వర్యంలో నడుస్తున్న తెలంగాణ జాగృతిని భారత్‌ జాగృతిగా మార్చి యాక్టివ్ చేయాలనుకోవడం కూడా కేంద్రాన్ని ఎదుర్కొనే వ్యూహాలలో ఒకటిగానే చెప్పుకోవచ్చు. 

కనుక ఇదేదో రాష్ట్రం కోసమో, దేశం కోసమో లేదా ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసమో జరుగుతున్న పోరాటాలని అనుకోలేము. ఇవి బిఆర్ఎస్‌, బిజెపిల మద్య జరుగుతున్న రాజకీయ ఆధిపత్య పోరాటాలు మాత్రమే. కనుక రెండు పార్టీలు దేని ఎత్తులు అవి వేస్తూ ఒకదానిపై మరొకటి పైచేయి సాధించేందుకు ప్రయత్నిస్తున్నాయి. వాటిలో చివరికి ఏది పైచేయి సాధిస్తుందనేది కాలమే చెపుతుంది.


Related Post