తండ్రిపై అలిగి రధం ఎక్కుతున్న ముఖ్యమంత్రి

October 20, 2016


img

యూపిలో అధికార సమాజ్ వాదీ పార్టీలో కుటుంబ కలహాలు మళ్ళీ రచ్చకెక్కాయి. ఆ పార్టీలో ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఒకడు ఒకవైపు, అయన తండ్రి ములాయం సింగ్ యాదవ్, చిన్నాన్న శివపాల్ యాదవ్ ఇద్దరూ మరోవైపు నిలిచి గొడవలు పడుతున్నారు. అవి నానాటికీ పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. 

సమాజ్ వాదీ పార్టీ స్థాపించి 25 సం.లు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు శివపాల్ యాదవ్ నేతృత్వంలో నవంబర్ 5వ తేదీన లక్నోలో భారీబహిరంగ ఏర్పాటు చేయడానికి సన్నాహాలు జరుగుతుంటే, ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ దానికి రెండు రోజుల ముందుగా అంటే నవంబర్ 3 నుంచి రధయాత్ర పెట్టుకొని రాష్ట్ర పర్యటనకి బయలుదేరుతున్నారు. తన స్వంత పార్టీకి ఎంతో ముఖ్యమైన ఆ కార్యక్రమానికి ముఖ్యమంత్రిగా ఉన్న అయన హాజరుకాకుండా, ఎన్నికల ప్రచారానికి బయలుదేరాలనుకోవడం ఆ పార్టీలో అంతర్గత కలహాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో అర్ధం చేసుకోవచ్చు.

 “మీరు మీ పార్టీ కార్యక్రమానికి హాజరు అవుతారా?” అని మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకి “దానికి ఎవరు హాజరు అవుతారో ఎవరు కారో మీకు తెలుసు కదా?” అని అఖిలేష్ యాదవ్ ప్రశ్నించడం గమనిస్తే ఆయన తన తండ్రి మూలాయం సింగ్ యాదవ్, చిన్నాన్న శివపాల్ యాదవ్ లపై ఎంత ఆగ్రహంగా ఉన్నారో అర్ధం చేసుకోవచ్చు. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడైన ములాయం సింగ్ యాదవ్ ఇటీవల “ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాతే ముఖ్యమంత్రి ఎవరనేది నిర్ణయిస్తాము,” అని చెప్పడమే అఖిలేష్ యాదవ్ ఆగ్రహానికి కారణం. ఆ తరువాత ఆయనని బుజ్జగించేందుకు ‘అఖిలేష్ యాదవే మా పార్టీ ఎన్నికల రధసారధి’ అని ప్రకటించారు కానీ ‘ఆయనే మళ్ళీ మా ముఖ్యమంత్రి అభ్యర్ధి’ అని ప్రకటించకపోవడంతో అఖిలేష్ యాదవ్ అలిగి రధం ఎక్కుతున్నారు. 

ఎన్నికలు ముంచుకు వస్తున్న ఈ తరుణంలో తండ్రి కొడుకులు ఈవిధంగా కీచులాడుకోవడం వలన పార్టీకి చాలా నష్టం జరుగుతుందని వారికీ తెలుసు కానీ ఎవరూ వెనక్కి తగ్గే ఆలోచన చేయకపోవడంతో ఎవరి సైకిల్ (ఆ పార్టీ చిహ్నం) వారిదే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా ఆ పార్టీ అధిష్టానం మేల్కొనకపోతే, ఆ సైకిల్ ని ఏనుగు (బి.ఎస్.పి.చిహ్నం) తొక్కేయవచ్చు లేదా భాజపా రధ చక్రాల క్రింద నలిగిపోయే ప్రమాదం ఉంటుంది.


Related Post