పుష్ప, కాంతారాలతో బాలీవుడ్ నాశనం: అనురాగ్ కశ్యప్

December 12, 2022


img

బాహుబలి, ఆర్ఆర్ఆర్, పుష్ప, కార్తికేయ, కాంతార, ఇలా చెప్పుకొంటూపోతే పాన్ ఇండియా మూవీల జాబితా చాలా పెద్దదిగానే ఉంది. అది నానాటికీ పెరుగుతూనే ఉంది కూడా. దక్షిణాది సినిమాలు జాతీయస్థాయిలో ఆడుతూ విజయం సాధిస్తుండటం మనకి గర్వంగానే ఉంటుంది. 

అయితే ఈ పాన్ ఇండియా మూవీల మాయలో పడి కొట్టుకుపోతున్న బాలీవుడ్ తన ఉనికినే కోల్పోయే పరిస్థితికి చేరుకొంటోందని ప్రముఖ బాలీవుడ్‌ దర్శకుడు అనురాగ్ కశ్యప్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇదివరకు సైరత్ అనే సినిమా మరాఠీ చిత్రా పరిశ్రమని ఏవిదంగా దెబ్బ తీసిందో ఇప్పుడు ఈ దక్షిణాది నుంచి కుప్పలు తెప్పలుగా వచ్చిపడుతున్న పాన్ ఇండియా మూవీలతో బాలీవుడ్‌ నాశనం అవుతోందని అన్నారు. 

దక్షిణాదికే పరిమితమైన కధలు, వాటితో తీసిన ప్రాంతీయ సినిమాలు, వాటి విజయాలతో బాలీవుడ్‌ తీవ్రంగా నష్టపోతోందని అన్నారు. ప్రస్తుతం బాలీవుడ్‌లో ఎటువంటి సినిమా తీయాలనే ఆలోచన చేయకుండా పాన్ ఇండియా మూవీలు తీయాలనే తాపత్రయమే ఎక్కువైపోతోందని, ఈ పాన్ ఇండియా మూవీల పిచ్చిలో బాలీవుడ్‌ తన గుర్తింపునే కోల్పోతోందని అనురాగ్ కశ్యప్ ఆవేదన వ్యక్తం చేశారు. 

ఆయన ఆవేదన బాలీవుడ్‌పై దక్షిణాది సినిమాల దాడి పట్ల అసహనం, అసంతృప్తిలా కనిపిస్తున్నప్పటికీ, ఒక దర్శకుడిగా బాలీవుడ్‌ గుర్తింపుని కోల్పోతుందనే ఆవేదన కూడా కనిపిస్తోంది. దక్షిణాదితో సహా దేశంలో ప్రతీ రాష్ట్రానికి ప్రత్యేకమైన భాష, సంస్కృతి, సంప్రదాయాలు, విభిన్నమైన జీవనశైలి, పరిస్థితులు కలిగి ఉంటాయని అందరూ అంగీకరిస్తారు. కనుక దేని ఉనికి అది కాపాడుకోవడం చాలా అవసరం. 

అందుకే మలయాళంలో సూపర్ హిట్ అయిన సినిమాలని తెలుగులో రీమేక్ చేస్తున్నప్పుడు తెలుగు నేటివిటీ ఉండేలా, తెలుగు ప్రజల అభిరుచులకు తగ్గట్లుగా అవసరమైన అన్ని మార్పులు చేస్తారు. అప్పుడే ఆ సినిమాలు విజయం సాధించే అవకాశాలు పెరుగుతాయి. అయితే స్ట్రెయిట్ తెలుగు సినిమాకి, రీమేక్ సినిమాకి ఎప్పుడూ తేడా ఉంటుందని అందరికీ తెలుసు. అదేవిదంగా స్ట్రెయిట్ హిందీ సినిమాకి, దక్షిణాది సినిమాల హిందీ వెర్షన్‌కి కూడా అంతే తేడా ఉంటుంది. కనుక అక్కడి ప్రేక్షకులు దానిని దక్షిణాది సినిమాగానే చూస్తారు ఎందుకంటే దానిలో వారి ఆత్మ ఉండదు కనుక! 

అయితే దక్షిణాది పాన్ ఇండియా మూవీలు విజయవంతం అవుతుండటం, వందల కోట్లు కలెక్షన్స్ రాబడుతుండటంతో బాలీవుడ్‌ దర్శక నిర్మాతలు కూడా ఆ మాయలో పడి కొట్టుకుపోతుండటంతో ఆ ప్రభావం బాలీవుడ్‌పై తీవ్ర ప్రభావం చూపుతోంది. కనుక ఉత్తరాది, దక్షిణాది సినీ ఇండస్ట్రీలు వాటి ఆత్మని వదులుకోకుండా సినిమాలు తీసుకోగలిగితే వాటి వలన ఇండస్ట్రీ మరింత బలపడుతుంది. 

కాదని తెలుగు సినిమాలో ఓ సల్మాన్ ఖాన్, అనుపమ్ ఖేర్‌ని పెట్టి, లేదా ఓ హిందీ సినిమాలలో ఒకరిద్దరు దక్షిణాది హీరోలని పెట్టి పాన్ ఇండియా మూవీలు తీసి మంచి కలక్షన్స్‌ రాబట్టవచ్చునేమో కానీ చివరికి ఇండస్ట్రీ గుర్తింపుని కోల్పోయి ప్రేక్షకుల నిరాధారణకి గురయ్యే ప్రమాదం ఉంటుంది. అదే దర్శకుడు అనురాగ్ కశ్యప్ చెపుతున్నట్లు భావించవచ్చు. 


Related Post