ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో మన్నెగూడలో వైశాలి-నవీన్ రెడ్డిల వ్యవహారంలో ఎవరిది తప్పు?అనే విషయం వారికి, వారి సన్నిహితులకి బాగానే తెలిసి ఉంటుంది. తెలియనివారికి పోలీసుల దర్యాప్తు తర్వాత తెలుస్తుంది.
అయితే వైశాలి, నవీన్ రెడ్డి ఇద్దరినీ వేర్వేరుగా చూస్తే, నవీన్ రెడ్డి ఎంతో కష్టపడి జీవితంలో పైకి వచ్చిన్నట్లు అర్దమవుతోంది. అంతేకాదు తాను స్థాపించిన మిస్టర్-టి ద్వారా అనేకమంది ఉపాధి కూడా కల్పించినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఈ స్థాయికి ఎదిగాడు కనుక ఆస్తిపాస్తులు బాగానే సంపాదించి జీవితంలో స్థిరపడినట్లు అర్దమవుతోంది. కనుక నచ్చిన యువతిని పెళ్ళి చేసుకోవాలనుకోవడం సహజమే.
ఇక వైశాలి తండ్రి దామోదర్ రెడ్డి మిలటరీలో రిటైర్ అయ్యి మన్నెగూడలో స్థిరపడ్డారు. కనుక ఆయన కుటుంబం కూడా ఆర్ధికంగా బలంగానే ఉన్నట్లు అర్దం అవుతోంది. ఇక వైశాలి కూడా బీడీఎస్ చదువుతూ డెంటల్ డాక్టర్‌గా మంచి జీవితం సాధించబోతోంది. కనుక ఆమె కూడా నచ్చిన వ్యక్తిని పెళ్ళిచేసుకోవాలనుకోవడం సహజమే.
నవీన్ రెడ్డితో పరిచయం అయిన తర్వాత అతను తనకు ప్రపోజ్ చేస్తే ఆమె నో చెప్పలేదు. తల్లితండ్రులతో మాట్లాడమని సూచించానని చెప్పింది. అంటే ఆమె కూడా నవీన్ రెడ్డిని ఇష్టపడినట్లు అర్దమవుతోంది. వారి కులాలు కూడా ఒకటే కనుక ఇరుకుటుంబాలు వారి పెళ్ళికి సానుకూలంగా స్పందించి ఉండవచ్చు. ఈ నేపధ్యంలో ఇరు కుటుంబాలు కలిసి విహారయాత్రలకి వెళ్ళి ఉండవచ్చు. ఉండకపోవచ్చు. అలాగే నవీన్ రెడ్డి వద్ద పుష్కలంగా డబ్బు ఉంది కనుక వైశాలి కుటుంబానికి సాయం చేసి ఉండవచ్చు కూడా.
వారి పెళ్ళికోసం మద్యవర్తి చర్చలు కూడా జరిపిన తర్వాత విఫలం అవడం నిజమైతే అది విఫలం కావడానికి కట్నకానుకల డిమాండ్, లేదా మరేదైనా కారణం అయ్యుండవచ్చు. కారణం ఏదైనప్పటికీ వైశాలి, ఆమె తల్లితండ్రులు నవీన్ రెడ్డితో సంబంధం వద్దనుకొన్నారు. ఈ విషయం నవీన్ రెడ్డి జీర్ణించుకొని నిగ్రహించుకోకపోవడమే ఇటువంటి తీవ్రమైన నిర్ణయాలు తీసుకొనేలా చేశాయని, అవే చివరికి అతని కష్టపడి సాధించుకొన్న జీవితాన్ని దారుణంగా దెబ్బ తీసాయని చెప్పవచ్చు.
వైశాలి ఇంటికి సమీపంలో నవీన్ రెడ్డి స్థలం లీజుకి తీసుకొని షెడ్ నిర్మించి ఆమెపై నిఘా పెట్టడం, ఆమెకి ఫోన్లు, మెసేజులు పంపుతుండటం, చివరికి ఆమె నిశ్చితార్దం జరుగబోతుంటే తన మిస్టర్-టీ కోట్లలో పనిచేస్తున్నవారిని అందరినీ వెంటేసుకొని వైశాలి ఇంటిపై దాడి చేసి కిడ్నాప్ చేయడం చాలా విపరీతమైన చర్యలే.
మళ్ళీ ఇద్దరిలో తప్పు ఎవరిది? అనే విషయాన్ని పక్కనపెడితే, ఈ వ్యవహారం గురించి మీడియాలో వార్తలు రావడంతో వైశాలి, ఆమె తల్లితండ్రులు కూడా తీవ్ర అప్రదిష్టపాలయ్యారు. కనుక తప్పు ఎవరిదైనప్పటికీ వైశాలి సామాజికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవలసిరావచ్చు. కొంతకాలం తర్వాత క్రమేణా అన్ని చల్లబడే వరకు ఈ సమస్యలని భరించవలసిరావచ్చు.
అంతిమంగా దీంతో ఎవరు ఎక్కువ నష్టపోయారంటే నవీన్ రెడ్డి, ఈ దాడి, కిడ్నాప్‌లో పాల్గొన్నవారు, వారిపైనే ఆధారపడిన వారి కుటుంబాలే అని చెప్పక తప్పదు. అంతమందిలో ఏ ఒక్కరూ నవీన్ రెడ్డి ఆవేశంతో చేస్తున్న పనులని వారించలేదా? వీటితో ఎటువంటి పర్యవసానాలు ఎదుర్కోవలసివస్తుందో వారిలో ఏ ఒకరు చెప్పలేదా? చెప్పినా నవీన్ రెడ్డి వినలేదా? తెలీదు!
ఈ వేధింపులు, ఫోటో మార్ఫింగ్, బ్లాక్ మెయిల్, దాడి, కిడ్నాప్, యువతి పట్ల కారులో అసభ్యంగా ప్రవర్తించడం వంటివన్నీ చాలా తీవ్రమైన నేరాలే. ఈ నేరాలకి పలు సెక్షన్స్ కింద పోలీసులు నమోదు చేసిన కేసులు చాలా తీవ్రమైనవే. కనుక నవీన్ రెడ్డితో సహా అందరి జీవితాలు ఒక్కసారిగా తారుమారు అయినట్లే. కానీ చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకొని ప్రయోజనం ఉందనట్లే ఇప్పుడు పశ్చాత్తాపపడి ప్రయోజనం ఉండదు. ఈ ముగింపు క్షణికావేశంలో రెచ్చిపోయే ప్రేమికులందరికీ ఓ గుణపాఠం వంటిదే అని చెప్పకతప్పదు.