కరుణానిధి వారసుడు ఆయనే!

October 20, 2016


img

తమిళనాడులో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అధినేత కరుణానిధి తన చిన్న కొడుకు స్టాలిన్ తన రాజకీయ వారసుడని ఈరోజు ప్రకటించేశారు. గతంలో కూడా ఓసారి ఆయన స్టాలిన్ తన వారసుడని ప్రకటించినప్పుడు, పార్టీ పగ్గాలు చేపట్టాలని ఆరాటపడుతున్న పెద్ద కొడుకు మాజీ కేంద్రమంత్రి అళగిరి పార్టీపై అలిగి వెళ్ళిపోయారు. మళ్ళీ ఇటీవల జరిగిన ఎన్నికల ముందు బెట్టువదిలి పార్టీలోకి వచ్చారు. కానీ అన్నదమ్ముల మద్య ఆధిపత్యపోరు ఇంకా కొనసాగుతూనే ఉంది. కరుణానిధి మళ్ళీ ఇప్పుడు వారసత్వ ప్రకటన చేశారు కనుక అళగిరి పార్టీలో ఉండి తమ్ముడితో యుద్ధం చేస్తారో లేకపోతే పార్టీ విడిచి వెళ్ళి వేరు కుంపటి పెట్టుకొంటారో చూడాలి.

వారి ఆధిపత్య పోరు కారణంగానే కుర్చీలో నుంచి లేచి నిలబడలేని 93 ఏళ్ళ వయసున్న కరుణానిధి కొన్ని నెలల క్రితం జరిగిన శాసనసభ ఎన్నికలలో అతికష్టం మీద ఎన్నికల ప్రచారం కూడా చేశారు. ఒకవేళ తమ పార్టీ గెలిస్తే తానే ముఖ్యమంత్రి పదవి చేపడతానని ప్రకటించారు. ఆయన విజయం సాధించగలిగారు కానీ పార్టీ విజయం సాధించలేకపోయింది. అలాగని ఘోరపరాజయం పొందలేదు. కొద్దిపాటి సీట్ల తేడాతో ఓడిపోయింది. అందుకు ఇతర కారణాలతో బాటు అన్నదమ్ముల మద్య జరుగుతున్న ఆధిపత్యపోరు, కరుణానిధి వృద్ధాప్యమే కారణాలుగా చెప్పవచ్చు. ఈ కారణంగానే తమిళనాట రాజకీయాలలో డిఎంకె వెనుకబదిపోతోంది. కనుక ఇప్పటికైనా ఆ అయోమయం నుంచి పార్టీని బయటపడేయాలనే ఉద్దేశ్యంతోనే కరుణానిధి ఈ సాహాసానికి పూనుకొని ఉంటారు. దాని పర్యవసానాలు ఏవిధంగా ఉండబోతున్నాయో చూడాలి.  


Related Post