గుజరాత్‌లో నోటా ఓట్లు 5 లక్షలు.. దేనికి సంకేతం?

December 09, 2022


img

గుజరాత్‌ శాసనసభ ఎన్నికలలో బిజెపి తిరుగులేని మెజార్టీతో వరుసగా ఏడోసారి మళ్ళీ అధికారంలోకి వచ్చింది. కనుక దేశవ్యాప్తంగా బిజెపి శ్రేణులు సంబరాలు చేసుకొంటున్నారు. అయితే గుజరాత్‌ ఎన్నికలలో ఏకంగా 5 లక్షల మంది నోటాకి ఓట్లు వేశారు. అంటే పోటీ చేసిన అభ్యర్ధులలో బిజెపితో సహా ఎవరూ తమకి ఆమోదం కాదని తెలిపారు.

2017 ఎన్నికలలో 5.51 లక్షల మంది నోటాకి ఓట్లు వేస్తే ఈసారి 5 లక్షల మంది మాత్రమే వేశారు కనుక నోటా శాతం కాస్త తగ్గిందని కేంద్ర ఎన్నికల కమీషన్‌ చెప్పింది. అయితే గుజరాత్‌ ప్రజలు బిజెపి పాలనని మెచ్చి మళ్ళీ తమకే ఏడోసారి పట్టం కట్టారని సంబరాలలో మునిగితేలుతున్న ఆ పార్టీ నేతలు నోటా ఓట్ల గురించి పట్టించుకోవడం లేదు. మొత్తం పోలైన ఓట్లలో 53 శాతం పైగా ఓటర్లు తమకు ఓట్లేసిగెలిపించారని కానీ కేవలం 1.5 శాతమే నోటాకి వేశారని కనుక వారి అసంతృప్తిని పట్టించుకోనవసరంలేదని బిజెపి నేతలు భావిస్తున్నారు.

కానీ బిజెపి ప్రభుత్వం పట్ల, ఎన్నికల బరిలో దిగిన పార్టీల పట్ల గుజరాత్‌లో 5 లక్షల మంది ప్రజలు నమ్మకం కోల్పోయారని నోటా ద్వారా చాటి చెప్పారు. 

గుజరాత్‌ ఎన్నికల సందర్భంగా మీడియాలో గుజరాత్‌లో పరిస్థితుల గురించి మీడియాలో చాలా విస్తృతంగా చర్చలు జరిగాయి. వాటిలో పాల్గొన్న మేధావులు, నిపుణులు, రాజకీయ విశ్లేషకులు బిజెపి చెప్పుకొంటున్నట్లు గుజరాత్‌లో అంత గొప్పగా ఏమీలేదని, నేటికీ సామాన్య ప్రజలు కనీస వసతులు, సంక్షేమ పధకాలు లేక అల్లాడుతున్నారని అభిప్రాయపడ్డారు. కానీ ప్రధాని నరేంద్రమోడీ, అమిత్‌ షాల ఎన్నికల వ్యూహాలతోనే గుజరాత్‌లో బిజెపి గట్టెక్కగలిగిందనే వాదనలు వినిపిస్తున్నాయి. 

గుజరాత్‌ ప్రజలలో గూడుకట్టుకొన్న అసంతృప్తి కారణంగా ఈసారి కాంగ్రెస్ పార్టీకి గెలిచే అవకాశాలు ఉన్నప్పటికీ ఈ అవకాశాన్ని కాంగ్రెస్ అధిష్టానం సరిగ్గా వినియోగించుకోలేకపోయిందని మంత్రి జగదీష్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఇక ఆమాద్మీ, మజ్లీస్ పార్టీలు కూడా కాంగ్రెస్‌ ఓట్లు చీల్చి దాని ఓటమికి, బిజెపి గెలుపుకి పరోక్షంగా తోడ్పడ్డాయని ఆ పార్టీ గుజరాత్‌ అధ్యక్షుడు అభిప్రాయపడ్డారు. 

ఏది ఏమైమినప్పటికీ బిజెపి మళ్ళీ భారీ మెజార్టీతో ఎన్నికలలో గెలిచి అధికారంలోకి వచ్చేస్తోంది కనుక మరో 5 ఏళ్ళ వరకు గుజరాత్‌ గురించి అది ఆలోచించనవసరం లేదు. తెలంగాణ వంటి మిగిలిన రాష్ట్రాలలో ఏవిదంగా అధికారం చేజిక్కించుకోవాలా అని ఆలోచించడానికి బిజెపికి ఇప్పుడు బోలెడంత సమయం కూడా దక్కిందనుకోవచ్చు.       



Related Post