సిఎం కేసీఆర్ అంచనాలకు భిన్నంగా గుజరాత్‌లో బిజెపి 182కి 156 సీట్లు గెలుచుకొని భారీ మెజార్టీతో వరుసగా ఏడోసారి అధికారంలోకి వచ్చింది. దీంతో కేసీఆర్ జాతీయ రాజకీయ ప్రవేశంపై పునరాలోచించుకోవలసిన పరిస్థితి ఏర్పడిందని చెప్పవచ్చు. ఒకవేళ గుజరాత్‌లో బిజెపి ఓడిపోయుంటే అప్పుడు కేసీఆర్‌తో బిజెపియేతర పార్టీలు చేతులు కలిపేందుకు ముందుకు వచ్చి ఉండేవి. కానీ గుజరాత్‌లో గెలుపుతో బిజెపి మరింత బలపడింది. కనుక కేంద్రంపై కత్తులు దూస్తున్న కేసీఆర్‌తో చేతులు కలిపేందుకు ఎవరూ ముందుకు రాకపోవచ్చు.
ప్రధాని నరేంద్రమోడీతో అలుపెరుగని పోరాటాలు చేసిన ఢిల్లీ, పశ్చిమ బెంగాల్ సిఎంలు కేజ్రీవాల్, మమతా బెనర్జీ అంతటివారు చేతులెత్తేసి మోడీకి విధేయంగా మారిపోయారు. కనుక ఇప్పుడు బిజెపియేతర పార్టీలను కలుపుకుపోవడం కేసీఆర్‌కి ఇంకా కష్టం అవుతుంది. కనుక జాతీయ రాజకీయ ప్రవేశంపై పునరాలోచించుకోక తప్పదు.
ఇదీగాక గుజరాత్ విజయంతో తెలంగాణలో బిజెపి మరింత దూకుడుగా వ్యవహరించడం ఖాయం. బిజెపి తదుపరి లక్ష్యం తెలంగాణ రాష్ట్రమే అని ప్రధాని నరేంద్రమోడీ మొదలు బండి సంజయ్ వరకు అందరూ చాలా విస్పష్టంగా చెపుతుండటమే కాక, టిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకి ప్రయత్నిస్తూ ఆ దిశలో తెర వెనుక గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు స్పష్టమైంది. అలాగే ఐటి, ఈడీ, సీబీఐ దాడులు కూడా ఆ ప్రయత్నంలో జరుగుతున్నవే అని మంత్రులు, ఎమ్మెల్యేలే స్వయంగా చెపుతున్నారు.
కనుక ప్రధాని నరేంద్రమోడీ, అమిత్ షా ఇద్దరూ తెలంగాణ రాష్ట్రంపై దృష్టి పెట్టి పనిచేయడం మొదలుపెడితే కేసీఆర్ జాతీయ రాజకీయాల కోసం రాష్ట్రంలో నుంచి అడుగుబయటపెట్టలేని పరిస్థితి ఏర్పడవచ్చు.
ఈ నేపధ్యంలో సిఎం కేసీఆర్ టిఆర్ఎస్‌ను కాపాడుకొంటూనే తెలంగాణలో మరింత పట్టుపెంచుకొనేందుకు గట్టిగా ప్రయత్నించాల్సి ఉంటుంది. వచ్చే ఎన్నికలలో టిఆర్ఎస్ విజయం సాధించిన తర్వాత అప్పుడు కేసీఆర్ జాతీయ రాజకీయాలలో ప్రవేశించడానికి ఎటువంటి ఇబ్బందీ ఉండకపోవచ్చు. కనుక అంతవరకు తన జాతీయ రాజకీయాల ఆలోచనని కేసీఆర్ పక్కన పెట్టక తప్పదేమో?