మునుగోడు ఉపఎన్నికలు కాంగ్రెస్ ఓటమి కంటే కోమటిరెడ్డి సోదరులిద్దరూ చేసిన ద్రోహమే ఆ పార్టీకి ఎక్కువ నష్టం కలిగించిందని చెప్పవచ్చు. మునుగోడు ఎమ్మెల్యేగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన పదవికి, పార్టీకి రాజీనామా చేసి ఉపఎన్నికలను తెచ్చిపెట్టి కాంగ్రెస్ పార్టీని దెబ్బతీస్తే, ఆయన సోదరుడు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పార్టీలో ఉంటూనే పార్టీ అభ్యర్ధి ఓటమికి కారకులై పార్టీని దారుణంగా దెబ్బతీశారు.
వారి ఉన్నతికి కారణమైన కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసి కనీసం వారైనా లబ్దిపొందారా అంటే అదీ లేదు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉపఎన్నికలలో ఓడిపోగా, వెంకట్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ షోకాజ్ నోటీస్ జారీ చేసింది. వీలైతే పార్టీ పగ్గాలు చేపట్టాలని తహతహలాడిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి షోకాజ్ అందుకోవడం, ఎమ్మెల్యేగా ఉన్న రాజగోపాల్ రెడ్డి చేజెతులా ఆ పదవిని పోగొట్టుకొట్టుకొని ఇద్దరూ తీవ్రంగా నష్టపోయారు. ఇది స్వయంకృతమే కనుక ఎవరినీ నిందించలేని పరిస్థితి.
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గురువారం తిరుమల శ్రీవారిని దర్శించుకొన్నాక్క అక్కడ మీడియాతో మాట్లాడుతూ, “నేను కొంతకాలం కాంగ్రెస్ పార్టీకి, రాజకీయాలకి దూరంగా ఉంటూ నా నియోజకవర్గంలో అభివృద్ధి పనులపై దృష్టిపెట్టాలనుకొంటున్నాను. పార్టీ మారడం గురించి నేను ఎన్నికలకి ముందు తగిన నిర్ణయం తీసుకొంటాను,” అని చెప్పారు.
నియోజకవర్గంపై దృష్టి పెట్టాలనుకోవడం అంటే మునుగోడు ఉపఎన్నికల కారణంగా పోయిన పరువుని, పోగొట్టుకొన్న క్యాడర్‌ని మళ్ళీ సంపాదించుకోవడమే అని వేరే చెప్పక్కరలేదు. నియోజకవర్గంపై మళ్ళీ పట్టు సాధిస్తే మళ్ళీ కాంగ్రెస్ లేదా బిజెపి ఎర్ర తివాచీ పరిచి స్వాగతం చెపుతాయని తెలిసిందే. కోమటిరెడ్డి సోదరులు ఇద్దరూ బిజెపిలో చేరుతారని బండి సంజయ్ ఎప్పుడో చెప్పారు. కనుక టికెట్లు, సీట్లు అన్నీ బేరమాడుకొన్నాక బిజెపిలో చేరుతారేమో?