గత టిఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా ఓ వెలుగు వెలిగినవారిలో జూపల్లి కృష్ణారావు కూడా ఒకరు. కానీ 2018 డిసెంబర్‌లో జరిగిన ముందస్తు ఎన్నికలలో ఓడిపోవడంతో టిఆర్ఎస్‌లో ఆయనని పట్టించుకొనేవారే కరువయ్యారు. దానికి తోడు నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో టిఆర్ఎస్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డితో కీచులాటలు తలనొప్పిగా మారాయి. అయినప్పటికీ జూపల్లి ఇంతకాలం చాలా సంయమనం పాటించారు. కానీ సిఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఇద్దరూ పట్టించుకోకపోవడంతో ఆయన తన దారి తాను వెతుక్కోనే పనిలో పడ్డారు.
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటలో బుదవారం ‘జూపల్లి మరో ప్రస్థానం’ పేరిట తన అనుచరులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. నీళ్ళు, నిధులు, నియామకాల కోసం ఎన్నో పోరాటాలు చేసి సాధించుకొన్న తెలంగాణ రాష్ట్రంలో ఆ మూడు ఆకాంక్షలు నెరవేరడం లేదు. నేటికీ రాష్ట్రంలో ప్రజలు అనేక సమస్యలను ఎదుర్కొంటూనే ఉన్నారు. నేటికీ రైతుల సమస్యలు తీరనే లేదు. రాష్ట్రంలో నిరుద్యోగుల సంఖ్య నానాటికీ పెరిగిపోతూనే ఉంది. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొన్నా నేటికీ ఇన్ని సమస్యలు ఎందుకు పేరుకుపోయాయి? కొల్లాపూర్‌లో 1600 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాలకు గురవుతోందని ఆర్డీవోకి లిఖితపూర్వకంగా పిర్యాదుచేసినా పట్టించుకోవడం లేదంటే పరిస్థితి అర్దం చేసుకోవచ్చు.
ప్రభుత్వం పట్టించుకోకపోయినా నేను ప్రజాసమస్యల పరిష్కారం కోసం పోరాడుతూనే ఉంటాను. జిల్లాలో ప్రతీ పల్లెకి వెళ్ళి ప్రజలే కేంద్రంగా పనిచేసుకుపోతాను. అప్పుడు నేను ఏ పార్టీలో ఉండాలో ప్రజలే నిర్ణయిస్తారు. పదవులు కూడా వాటంతట అవే వస్తాయి. వాటి కోసం నేను ఏనాడూ ఆరాటపడలేదు. ప్రజలు, వారి సంక్షేమమే నాకు ముఖ్యం,” అని అన్నారు.
జూపల్లి కృష్ణారావుని కేసీఆర్, కేటీఆర్ పట్టించుకోలేదు గనుకనే ఆయన ఈవిదంగా విమర్శలు చేస్తున్నారని చెప్పవచ్చు. ఒకవేళ ఏదో పదవిలో ఉండి ఉంటే ఆయన కూడా మిగిలినవారిలా కేసీఆర్ అద్భుతమైన పాలన అందిస్తూ రాష్ట్రాన్ని ఆన్ని రంగాలలో అభివృద్ధి చేస్తున్నారంటూ పొగుడుతూ ఉండేవారు.
రాజకీయ నాయకులు అందరూ ప్రజాసేవ కోసమే రాజకీయాలలో ఉన్నామని చెప్పుకోవడం పరిపాటి. కానీ పదవులు, అధికారం కోసం వారి తాపత్రయమని జూపల్లి మాటలతోనే అర్దం అవుతోంది. కనుక జూపల్లి ఇచ్చిన తొలి సంకేతాన్ని కేసీఆర్ గమనించి బుజ్జగిస్తారా లేదా? పట్టించుకోకపోతే తనకు అన్ని పార్టీల తలుపులు తెరిచే ఉన్నాయని జూపల్లి చెపుతున్నారు కనుక ఏ పార్టీలో చేరుతారనే విషయం త్వరలో తెలుస్తుంది.