ఓ పక్క ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు, మరోపక్క టిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణలు పోటాపోటీగా కొనసాగుతున్నాయి. వాటిలో కూడా కొన్ని అంశాలలో ఒకే విదమైన వాదనలు వినిపిస్తుండటం యాదృచ్చికమే కానీ కాస్త ఆశ్చర్యం కలిగిస్తుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో సీబీఐ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్‌లోకానీ ఛార్జ్ షీట్‌లో గానీ ఎక్కడా తన పేరు పేర్కొనబడలేదని కనుక తనని ఈ కేసులో నిందితురాలినని సీబీఐ ఏవిదంగా పేర్కొందని కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు.
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సరిగ్గా ఇదే వాదనలు వినిపించారు నిందితులుగా పేర్కొనబడి నోటీసులు అందుకొన్న బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్, వెల్లపల్లి తుషార్, డా.జగ్గుస్వామి, బూసారపు శ్రీనివాస్. వారిని నిందితులుగా పేర్కొంటూ సిట్ బృందం దాఖలు చేసిన మెమోని మంగళవారం ఏసీబీ కోర్టు తిరస్కరించింది. అవినీతికి సంబందించిన కేసుల దర్యాప్తు చేసే అధికారం కేవలం అవినీతి నిరోధక శాఖకి మాత్రమే ఉంటుందని, శాంతి భద్రతల (లా అండ్ ఆర్డర్ పోలీస్) పోలీసులకు కానీ, సిట్ బృందానికి గానీ ఉండదని ఏసీబీ కోర్టు చెప్పడం ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్న సిట్ బృందానికి పెద్ద షాక్ అనే చెప్పొచ్చు .
కనుక ఏసీబీ కోర్టు తీర్పుని సవాలు చేస్తూ సిట్ బృందం నేడు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేసింది. దానిని విచారణకి స్వీకరించిన హైకోర్టు ఈరోజు మధ్యాహ్నం భోజన విరామం తర్వాత 2.30 గంటలకి విచారణ చేపట్టేందుకు అంగీకరించింది.