వచ్చే ఎన్నికల తర్వాత మెట్రో పొడిగిస్తాం: కేటీఆర్‌

December 06, 2022


img

మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌ మంగళవారం ఎల్బీ నగర్‌లో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం చేశారు. ఫతుల్లాగూడలో ఆధునిక సౌకర్యాలతో నిర్మించిన హిందూ, ముస్లిం, క్రీస్టియన్ శ్మశానవాటికలను మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితో కలిసి కేటీఆర్‌ ప్రారంభించారు. నగరంలో తొలిసారిగా పెంపుడు జంతువుల కోసం నిర్మించిన శ్మశానవాటికని కూడా ప్రారంభించారు. 

ఎస్ఎన్‌డిపి ప్రాజెక్టులో భాగంగా బండ్లగూడ చెరువు నుంచి నాగోల్ చెరువు వరకు నిర్మించిన నాలా బాక్సు డ్రైన్, సెంట్రల్ గ్రౌండ్ వాటర్ సెంటర్ నుంచి ఫీర్జాదీగూడ వరకు నిర్మించిన లింక్ రోడ్డుని వారు ప్రారంభించారు. 

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ ప్రజలని ఉద్దేశ్యించి ప్రసంగిస్తూ, “రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పధకాలు జోడెద్దుల్లా పరుగులు తీస్తున్నాయి. మేము మిగిలిన రాజకీయనాయకుల్లా ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వకుండా అభివృద్ధి పనులు పూర్తిచేసి చూపిస్తున్నాము. సిఎం కేసీఆర్‌ నాయకత్వంలో ప్రణాళికాబద్దంగా ముందుకుసాగుతుండటం వలననే రాష్ట్రంలో ఇంత అభివృద్ధి సాధ్యమైంది. నగరంలో ట్రాఫిక్ రద్దీ నానాటికీ పెరిగిపోతున్నందున ఎల్బీ నగర్‌ నుంచి హయత్ నగర్‌ వరకు మెట్రో పొడిగించాలని విజ్ఞప్తులు వస్తున్నాయి. వచ్చే ఎన్నికలలో మళ్ళీ టిఆర్ఎస్‌ పార్టీయే గెలిచి అధికారంలోకి వస్తుంది. అప్పుడు తప్పకుండా ఎల్బీ నగర్‌ నుంచి హయత్ నగర్‌ వరకు మెట్రో ప్రాజెక్టుని కూడా పూర్తిచేస్తాము,” అని చెప్పారు. 

గత ఎన్నికలలో టిఆర్ఎస్‌ ఇచ్చిన నిరుద్యోగ భృతి, పంట రుణాల మాఫీ వంటి కొన్ని హామీలను టిఆర్ఎస్‌ నిలబెట్టుకోనప్పటికీ రాష్ట్రానికి భారీగా ఐ‌టి, ప్రైవేట్ పరిశ్రమలను రప్పించి భారీగా ఉద్యోగాలు కల్పిస్తోంది. మరోపక్క భారీ సంఖ్యలో ప్రభుత్వోద్యోగాల భర్తీ ప్రక్రియ కూడా కొనసాగుతోంది. కనుక నిరుద్యోగ భృతి హామీ అమలుచేయకపోయినా పెద్దగా ఎవరూ పట్టించుకోవడం లేదనే చెప్పవచ్చు. 

పంట రుణాల మాఫీపై రైతులలో అసంతృప్తి ఉన్నప్పటికీ గత 8 ఏళ్లలో వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌, పుష్కలంగా సాగునీటి సరఫరా చేస్తునందున వారి అసంతృప్తి కూడా చల్లారే ఉండవచ్చు. టిఆర్ఎస్‌ సర్కార్ హైదరాబాద్‌తో సహా రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి పనులు చేసి చూపిస్తోంది. పైగా సంక్షేమ పధకాలన్నీ అమలుచేస్తోంది. కనుక ప్రజలు ‘పనిచేసి చూపిస్తున్న’ టిఆర్ఎస్‌నే మళ్ళీ ఎన్నుకొనే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆ నమ్మకంతోనే మంత్రి కేటీఆర్‌ వచ్చే ఎన్నికల తర్వాత మెట్రో పొడిగిస్తామని చెప్పగలిగారని భావించవచ్చు. 



Related Post