బెదిరింపులకి భయపడేది లేదు.. టిఆర్ఎస్‌ని వీడేది లేదు: స్పీకర్‌

December 06, 2022


img

నేడు డా.అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా తెలంగాణ శాసనసభ స్పీకర్‌  పోచారం శ్రీనివాస్ రెడ్డి శాసనసభ ఆవరణలో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, “గత కొంతకాలంగా దేశంలో ప్రజలెన్నుకొన్న ప్రభుత్వాలను కూలద్రోసి దొడ్డిదారిలో అధికారంలోకి రావాలని లేదా అధికార పార్టీలోని ఎమ్మెల్యేలను నయన్నో భయాన్నో లొంగదీసుకొని ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇవి రాజ్యాంగాన్ని అవమానించడమే. ఓ స్పీకరుగా ఇంతకు మించి ఏమీ చెప్పలేను కానీ ఓ ఎమ్మెల్యేగా నేను ఒక మాట చెప్పదలచుకొన్నాను. నేను దశాబ్ధాల పాటు రాజకీయాలలో ఉన్నాను. అనేక పదవులను చేపట్టాను. కానీ రాష్ట్రాభివృద్ధి, ప్రజాసంక్షేమం పట్ల ఇంత తపన, చిత్తశుద్ధి ఉన్న ఏ ముఖ్యమంత్రిని చూడలేదు. 

గత ప్రభుత్వాలు అభివృద్ధి, సంక్షేమాన్ని పట్టించుకొనేవి కావు అందుకే మంత్రులు, ఎమ్మెల్యేలకు వారి నియోజకవర్గాలలో పని ఉండేది కాదు కనుక ఎప్పుడూ హైదరాబాద్‌లోనే కాలక్షేపం చేస్తుండేవారు. కానీ ఇప్పుడు అనేకానేక అభివృద్ధి, సంక్షేమ పధకాలు అమలవుతున్నాయి. వాటిని అమలుచేయడం కోసమే మేము ఎక్కువ కాలం మా నియోజకవర్గాలలోనే ఉండాల్సి వస్తోంది. ఎప్పుడో వాటి నుంచి కాస్త తీరిక దొరికినప్పుడు మాత్రమే హైదరాబాద్‌కి రాగలుగుతున్నాము. 

కనుక ఒత్తిళ్ళు, బెదిరింపులకు తలొగ్గి ఇటువంటి గొప్ప ముఖ్యమంత్రి కేసీఆర్‌ని, మంచి టిఆర్ఎస్‌ ప్రభుత్వాన్ని ఎన్నటికీ విడిచిపెట్టను. నేనే కాదు... టిఆర్ఎస్‌లో ఏ ఒక్కరూ కూడా పార్టీని, ప్రభుత్వాన్ని విడిచిపెట్టరు. కనుక మా పార్టీ నేతలని నయన్నో, భయన్నో లొంగదీసుకోవాలనే ప్రయత్నాలు మానుకొంటే మంచిది,” అని అన్నారు. 

అంటే టిఆర్ఎస్‌లో అందరూ నీతి నిజాయితీపరులే... ఎవరూ ప్రలోభాలకు, బెదిరింపులకు లొంగబోరని స్పీకర్‌  పోచారం శ్రీనివాస్ రెడ్డి చెపుతున్నట్లు అర్దమవుతోంది. వర్తమాన రాజకీయాలలో ఇది సాధ్యమా? అంటే కాదనే అందరికీ తెలుసు. సాక్షాత్ కేసీఆర్‌ కుమార్తె కల్వకుంట్ల కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో సీబీఐ నోటీస్ అందుకొన్నారు. మంత్రి మల్లారెడ్డి కాలేజీలలో భారీగా డొనేషన్లు వసూలు చేసినట్లు ఐ‌టి అధికారులు కనుగొన్నారు. మరో మంత్రి గంగుల కమలాకర్‌ గ్రానైట్ కంపెనీ ఆర్ధికలావాదేవీలపై ఈడీ దర్యాప్తు జరుపుతోంది. ఇవన్నీ రాజకీయ కక్ష సాధింపు చర్యలే అని సమర్ధించుకోవచ్చు కానీ వాస్తవాలని ఎవరూ ఎంతో కాలం కప్పిపుచ్చలేరు. 

గతంలో కాంగ్రెస్‌, టిడిపిల నేతలు, ఎమ్మెల్యేలను కూడా ఇదేవిదంగా నయన్నో, భయాన్నో టిఆర్ఎస్‌లోకి రప్పించుకొన్న సంగతి అందరికీ తెలుసు. ఇప్పుడు బిజెపి కూడా అదే చేస్తుంటే తప్పని ఎలా అనగలరు?టిఆర్ఎస్‌ ప్రభుత్వం మొదటి నుంచే ప్రజాస్వామ్యానికి కట్టుబడి ఉండి ఉంటే నేడు ఇన్ని సమస్యలు వచ్చేవే కావని చెప్పవచ్చు. కానీ రాష్ట్రంలో టిఆర్ఎస్‌ తప్ప మరో పార్టీ ఉండకూడదనే ఆలోచనతో కాంగ్రెస్‌, టిడిపి, తదితర పార్టీలని నిర్వీర్యం చేయడంతో వాటి స్థానంలో సర్వ శక్తివంతమైన బిజెపి ప్రవేశించి కేసీఆర్‌ని గద్దె దించేందుకు ప్రయత్నిస్తోందని చెప్పవచ్చు. బిజెపి కూడా కేసీఆర్‌ చేసిన తప్పులే చేస్తున్నాయి కనుక భవిష్యత్‌లో ఏదోరోజు దానికీ ఇటువంటి చేదు అనుభవమే ఎదుర్కోవలసి రావచ్చు.


Related Post