హైదరాబాద్‌కి మరో ఆకర్షణ... బన్సీలాల్ పేట మెట్ల బావి

December 05, 2022


img

విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌ నగరానికి చారిత్రిక ప్రాధాన్యం కూడా ఉందని నిరూపిస్తుంటాయి ఛార్మినార్, గోల్కొండ కోట వంటి పలు కట్టడాలు. తాజాగా ఆ జాబితాలో 300 సం.ల క్రితం నిజాం నవాబులు నిర్మించిన మెట్లబావి కూడా చేరింది. సమైక్య రాష్ట్రంలో గుర్తింపుకి నోచుకోని లేదా నిర్లక్ష్యానికి గురైన వాటిల్లో ఇదీ ఒకటి. 

బన్సీలాల్ పేటలో గల ఈ మెట్లబావిని పునరుద్దరించేందుకు సహిత అనే స్వచ్ఛంద సంస్థ సహకారంతో జీహెచ్‌ఎంసీ గత ఏడాది ఆగస్ట్ 15వ తేదీన పనులు ప్రారంభించి సుమారు 500 టన్నుల వ్యర్ధాలు తరలించింది. వాటితో పాటు చరిత్రకి అద్దంపట్టే అనేక అమూల్యమైన వస్తువులను కూడా వెలికితీసి అక్కడే కొత్తగా నిర్మించిన మ్యూజియంలో భద్రపరిచింది. ఈ పురాతమైన మెట్ల బావిని ఆనుకొని ఓ అంపీ థియేటర్ని కూడా నిర్మించారు. దీనిలో సాంస్కృతిక కార్యక్రమాలు జరుపుకొనేందుకు వీలుగా సకల సౌకర్యాలు కల్పించారు. 

ఆరు అంతస్తులతో పలు మెట్ల వరుసలు, స్థంభాలు, బాల్కనీలతో నిర్మించబడిన అద్భుతమైన కట్టడం అందరినీ ఆకట్టుకొంటుంది.  1970 వరకు ఈ బావి యదాతధంగానే ఉండేది. ఆ తర్వాత చుట్టుపక్కల జనావాసాలు పెరిగిపోవడంతో ప్రజలు ఇంట్లో చెత్తని తెచ్చి దానిలో పడేయడం ప్రారంభించారు. కానీ అప్పటి జీహెచ్‌ఎంసీ అధికారులు పట్టించుకోకపోవడంతో క్రమంగా అంత పెద్ద బావి చెత్తాచెదారంతో పూడుకుపోయింది. 

ఇప్పుడు ఈ మెట్లబావి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ మెట్లబావి పైకి సాదాసీదా కొలనులా కనిపిస్తున్నప్పటికీ 55 అడుగుల లోతు ఉంది. కనుక నిరంతరం తాజా నీరు ఊరుతూనే ఉంటుంది. బావిలో చెత్తను, మురికి నీటిని పూర్తిగా తొలగించిన తర్వాత రోజుకి సుమారు ఆరడుగుల ఎత్తు వరకు మంచి నీరు ఊరుతోంది. ప్రస్తుతం 53 అడుగుల లోతు స్వచ్చమైన మంచినీళ్ళతో మెట్ల బావి తళతళ మెరుస్తోందిప్పుడు. 

చుట్టుపక్కల నివసిస్తున్నవారు మళ్ళీ ఈ మెట్లబావిని డంపింగ్ యార్డుగా మార్చకుండా ఉంచేందుకు జీహెచ్‌ఎంసీ బావి చుట్టూ ఎత్తైన గోడలు, మంచి లైటింగ్ వ్యవస్థ, సెక్యూరిటీ సిబ్బందిని నియమించింది. ఈ ఫోటోలు చూస్తే జీహెచ్‌ఎంసీ, సహిత సంస్థలు కలిసి పురాతమైన ఈ మెట్లబావిని పునరుద్దరించడానికి ఎంతగా శ్రమించాయో గ్రహించవచ్చు. కనుక వీలైతే మీరూ ఓసారి వెళ్ళి సందర్శించండి. 


Related Post