మంత్రి మల్లారెడ్డి పీకకి మరో తాడు... ఈసారి ఈడీ?

December 02, 2022


img

కేసీఆర్‌ ప్రభుత్వంలో సీనియర్ మంత్రులలో ఒకరైన మల్లారెడ్డి, ఆయన కుమారులు, అల్లుడు, సన్నిహితుల  ఇళ్ళు, కార్యాలయాలు, కాలేజీలలో రెండు రోజుల పాటు సుమారు 500 మంది ఐ‌టి అధికారులు సోదాలు చేసి రూ.10 కోట్లు నగదు, పలు కీలక పత్రాలు స్వాదీనం చేసుకొన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా మల్లారెడ్డి మెడికల్ కాలేజీలో విద్యార్థుల నుంచి రూ.100 కోట్లు డొనేషన్లు వసూలు చేసినట్లు గుర్తించి, దానికి సంబందించిన పత్రాలపై మల్లారెడ్డి కుమారుడు చేత సంతకం తీసుకొని వెళ్ళారు. 

వారు తన కొడుకుని బెదిరించి బలవంతంగా సంతకం తీసుకొన్నారని మల్లారెడ్డి మీడియా ముందుకు వచ్చి చిందులు వేశారు. పోలీసులకి ఫిర్యాదు కూడా చేశారు. కానీ డొనేషన్లు వసూలు చేసినట్లు అంగీకార పత్రంపై ఓసారి సంతకం చేసిన తర్వాత అది మెడకి ఉరితాడువంటిదే అని వేరే చెప్పక్కరలేదు. అదీగాక ఐ‌టి అధికారులు స్వాధీనం చేసుకొన్న పలు కీలక పత్రాలు మంత్రి మల్లారెడ్డిని కేసులలో ఇరికించగలవే. 

ఇప్పుడు ఆయన మెడకి మరో కొత్త సమస్య చుట్టుకోబోతోంది. ఐ‌టి అధికారులు తాము స్వాధీనం చేసుకొన్న ఆ పత్రాలను, సేకరించిన సమాచారాన్ని ఈడీతో షేర్ చేసుకొన్నట్లు తెలుస్తోంది. అంటే ఈడీ కూడా రంగంలో దిగే అవకాశం ఉందన్న మాట! అదే జరిగితే మరిన్ని కేసులు ఆయన మెడకి చుట్టుకోవడం ఖాయం. 

ఐ‌టి, ఈడీ దాడులతో తమని ఎవరూ భయపెట్టలేరని టిఆర్ఎస్‌ నేతలు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నప్పటికీ ఒకసారి కేసులు మెడకి చుట్టుకొంటే ఎంతటివారైనా దిగిరాక తప్పదు. టిఆర్ఎస్‌ ఎమ్మెల్యేలను వందల కోట్లు ఇచ్చి లొంగదీసుకోవాలని ప్రయత్నించిన కేంద్ర ప్రభుత్వం అడ్డంగా దొరికిపోవడంతో ఇప్పుడు ఈవిదంగా ఈడీ, ఐ‌టి, సీబీఐలని ఉసిగొల్పుతూ భయపెట్టి లొంగదీసుకోవాలని ప్రయత్నిస్తోందని టిఆర్ఎస్‌ నేతలు వాదిస్తున్నారు. 

అది నిజం కూడా. కనుక మంత్రి మల్లారెడ్డి ఈ కేసుల ఒత్తిళ్ళు భరించలేక ఏదో ఓ రోజున బిజెపిలో చేరిపోతారా? చేరిపోగానే ఆయనపై పెట్టబోయే కేసులు, ఈ ఫైల్స్ అన్నీ అటకెక్కిపోవడం ఖాయమే. 

దర్యాప్తు సంస్థలు ఎంతో కష్టపడి రాజకీయాలలో ప్రముఖులు అవినీతికి, అక్రమాలకి పాల్పడుతున్నట్లు నిరూపిస్తుంటాయి. కానీ సదరు నాయకులు అధికార పార్టీలో చేరిపోగానే వారి అవినీతి భాగోతం అంతా మంత్రదండం తిప్పి మాయం చేసినట్లు మాయం అయిపోతుంటుంది.

అవినీతిపరులని నిరూపించేది కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలే. వారిని అక్కున చేర్చుకొనేది అవే! అవినీతిపరులని రుజువు చేయబడినవారినే ప్రజా ప్రతినిధులుగా ఎన్నుకోమని రాజకీయ పార్టీలు ప్రజల ముందుకు తెస్తాయి. అప్పుడు ప్రజలు ఏం చేయాలి?


Related Post