వారి ఉద్యోగాలు పీకేశారు సరే కానీ..

October 20, 2016


img

జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వంలో వివిధ శాఖలకి చెందిన 12 మంది అధికారులని ఉద్యోగాలలో నుంచి తొలగించారు. వారు దేశవ్యతిరేక శక్తులతో చేతులు కలిపి కుట్రలు పన్నుతున్నట్లు నిఘావర్గాలు గుర్తించి రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడంతో ప్రభుత్వం వారినందరినీ ఉద్యోగాలలో నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వారిలో రెవెన్యూ, ఇంజనీరింగ్, విద్యా, వైద్య, పౌరసరఫరా శాఖలకి చెందిన అధికారులున్నారు. వారిలో కాశ్మీర్ యూనివర్సిటీ అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ కూడా ఒకరు. వారందరూ వేర్పాటువాదులతో చేతులు కలిపి కాశ్మీర్ లో జరిగిన అల్లర్లని ప్రోత్సహించినట్లు గుర్తించారు. పోలీసులు వారిపై కేసులు నమోదు చేశారు. ప్రభుత్వ శాఖలలో పనిచేసే అధికారులే ఇటువంటి దుశ్చర్యలకి పాల్పడటం చాలా విస్మయం కలిగిస్తుంది. కనుక వారిపై చర్యలు తీసుకోవడం తప్పు కాదు. 

వారు ప్రభుత్వోద్యోగులు కనుక వారిని ఉద్యోగాలలో నుంచి తొలగించి వారిపై కేసులు నమోదు చేయగలుగుతున్నారు. కానీ జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి మహబూబా ముఫ్తీతో సహా అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు అందరూ బహిరంగంగానే వేర్పాటువాదులకి మద్దతుగా మాట్లాడుతుంటారు. ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ముఫ్తీ మొహమ్మద్ సయీద్ అయితే, పాక్ ప్రభుత్వం, ఉగ్రవాదులు, వేర్పాటువాదులు సహకరించబట్టే జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం శాసనసభ ఎన్నికలు సజావుగా జరుపుకోగలిగామని చెప్పడమే కాకుండా అందుకు వారందరికీ కృతజ్ఞతలు తెలుపుకొన్నారు కూడా. ఆయన కుమార్తె, ప్రస్తుతం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మహబూబా ముఫ్తీ కూడా తండ్రి అడుగుజాడలలోనే నడుస్తూ, ఉగ్రవాది బుర్హాన్ వనీని ఎన్కౌంటర్ చేయడం పొరపాటేనని, అతను బుర్హాన్ వనీ అని తెలియకనే భద్రతాదళాలు పొరపాటున ఎన్కౌంటర్ చేశాయని చెప్పారు. అందుకు భద్రతాదళాలని ప్రజలకి క్షమాపణలు చెప్పుకోవాలని ఆమె కోరారు. 

ఈవిషయంలో రాష్ట్రంలో అధికార, ప్రతిపక్షాలవి ఒకటే పద్ధతి. అందరూ వేర్పాటువాదులకి అనుకూలంగానే మాట్లాడుతుంటారు. అందుకే వేర్పాటువాదులు రాష్ట్రంలో సమాంతర ప్రభుత్వాన్ని నడుపగలుగుతున్నారు. 

ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టున మేయదు కనుక రాష్ట్రాన్ని ఏలుతున్న ముఖ్యమంత్రితో సహా అధికార, ప్రతిపక్షాల నేతలు అందరూ వేర్పాటువాదులకి మద్దతుగా మాట్లాడుతున్నప్పుడు, వారి క్రింద పనిచేసే అధికారులు, ఉద్యోగులు వేరేగా వ్యవహరించరు కదా? 

కనుక వేర్పాటువాదులకి అనుకూలంగా వ్యవహరించినందుకు వారిని తొలగించడం ఎంత అవసరమో, వారికి అనుకూలంగా మాట్లాడుతున్న రాజకీయ నేతల పట్ల కూడా కటినంగా వ్యవహరించడం అంతే అవసరం. కానీ జాతీయభావం గల భాజపా ఆ రాష్ట్రంలో వేర్పాటువాద భావాలుగల ముఫ్తీ సర్కార్ తో కలిసి పనిచేస్తోంది!

 మన ఆలోచనలలో, విధానాలలోనే ఇంత లోపం ఉందని తెలిసి ఉన్నా దానిని సరిదిద్దుకోవడానికి ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు ఇష్టపడనప్పుడు ఇక అధికారులని, ఉద్యోగులని నిందించి ఏమి ప్రయోజనం?


Related Post