మంత్రి గంగుల కమలాకర్‌కి సీబీఐ నోటీస్... ఢిల్లీలో విచారణ!

November 30, 2022


img

మంత్రి గంగుల కమలాకర్‌కి కొత్త కష్టాలు మొదలయ్యాయి. ఇప్పటికే ఆయనకి చెందిన గ్రానైట్ కంపెనీ ఆర్ధిక లావాదేవీలలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ ఈడీ అధికారులు ఇటీవల ఆయన ఇల్లు, కంపెనీలో సోదాలు చేశారు. ఇవాళ్ళ సీబీఐ అధికారులు కరీంనగర్‌లోని గంగుల కమలాకర్‌ నివాసానికి వెళ్ళి నోటీసులు ఇచ్చి రేపు ఢిల్లీలో విచారణకు హాజరుకావాలని కోరారు. అయితే ఇది గ్రానైట్ కంపెనీకి సంబందించిన కేసు కాదు. మరో కొత్త కేసు! 

కొంతకాలం క్రితం కాపు సమ్మేళనంలో విశాఖపట్నంకి చెందిన శ్రీనివాస్ అనే ఓ వ్యక్తి సీబీఐ అధికారిని అని పరిచయం చేసుకొని మంత్రి గంగులని కలిశాడు. గంగులతో ఫోటోలు దిగాడు. ఆ తర్వాత పలువురు ప్రముఖులను శ్రీనివాస్ మోసగించాడు. మూడు రోజుల క్రితం అతనిని ఢిల్లీలో తమిళనాడు భవన్‌లో సీబీఐ అధికారులు అరెస్ట్ చేసి ప్రశ్నించారు. 

అతనితో మంత్రి గంగులకి ఎటువంటి పరిచయం ఉంది?అతను నకిలీ సీబీఐ అధికారి అని తెలియక మంత్రి గంగుల అతనికి ఏమైనా తోడ్పడ్డారా?” అని ప్రశ్నించేందుకు సీబీఐ నోటీసు జారీ చేసింది. ఆయనతో పాటు గ్రానైట్ కంపెనీ లావాదేవీలలో అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న టిఆర్ఎస్‌ రాజ్యసభ సభ్యుడు గాయత్రి రవికి కూడా ఇదే కేసులో ప్రశ్నించేందుకు సీబీఐ అధికారులు ఈరోజు నోటీస్ ఇచ్చారు. 

వారిద్దరినీ అరెస్ట్ చేసేందుకే ఢిల్లీకి పిలిపిస్తున్నారా? హైదరాబాద్‌ లేదా తెలంగాణలో అరెస్ట్ చేస్తే టిఆర్ఎస్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేసి అడ్డుకొనేందుకు ప్రయత్నించవచ్చు కనుక ఈ సాకుతో ఢిల్లీకి రప్పిస్తున్నారా?అనే సందేహాలు అప్పుడే వ్యక్తం అవుతున్నాయి. ఒకవేళ వారిద్దరినీ ఢిల్లీలో అరెస్ట్ చేసినట్లయితే రాష్ట్ర స్థాయిలో టిఆర్ఎస్‌, బిజెపిల మద్య, ప్రభుత్వ స్థాయిలో కేసీఆర్‌, ప్రధాని నరేంద్రమోడీల మద్య యుద్ధం పతాకస్థాయికి చేరుకోవచ్చు.


Related Post