తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ఈరోజు నిర్మల్ జిల్లా భైంసా నుంచి మహా సంగ్రామ పాదయాత్ర ప్రారంభించారు. అంతకు ముందు భైంసా పట్టణానికి సమీపంలో బహిరంగసభ నిర్వహించి సిఎం కేసీఆర్, టిఆర్ఎస్ ప్రభుత్వం మీద నిప్పులు చెరిగారు. ఆ సభలో కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి కూడా పాల్గొని కేసీఆర్ ప్రభుత్వం మీద నిప్పులు చెరిగారు. రాబోయేది తమ ప్రభుత్వమే అని ఇద్దరూ గట్టిగా చెప్పారు. అయితే వారి సభకి దక్కాల్సిన మీడియా కవరేజిని టిఆర్ఎస్, వైఎస్సార్ టిపి కలిసి కాజేశాయని చెప్పవచ్చు.
వరంగల్ జిల్లాలో వైఎస్సార్ టిపి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాదయాత్ర చేస్తున్నప్పుడు టిఆర్ఎస్ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అనుచరులు ఆమె కారుపై దాడి చేసి అద్దాలు బద్దలు గొట్టడం, ఆమె కార్వాన్కి నిప్పు పెట్టడంతో అకస్మాత్తుగా హడావుడి మొదలైంది. నిన్న జరిగిన ఘటనలకు నిరసన తెలిపేందుకు వైఎస్ షర్మిల ఈరోజు ఉదయం కారులో ప్రగతి భవన్‌కి బయలుదేరడం, రాజ్‌భవన్ రోడ్డులో పోలీసులు ఆమెను కారుతో సహా ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్‌కి తరలించడం, ఆమెపై కేసు నమోదు చేయడం, విజయమ్మ గృహనిర్బందం వంటి నాటకీయ పరిణామాలు వరుసగా జరిగాయి.
దీంతో యావత్ మీడియా ఈ వార్తలనే కవర్ చేసింది తప్ప అక్కడ భైంసా పట్టణం వద్ద బండి సంజయ్, కిషన్ రెడ్డి ఏం చెప్పారో పట్టించుకోలేదు. దాంతో వారికి దక్కాల్సిన మీడియా కవరేజ్ వైఎస్ షర్మిలకి దక్కింది. టిఆర్ఎస్ ప్రభుత్వం బండి సంజయ్ పాదయాత్రను అడ్డుకోవాలని చూసినా హైకోర్టు అనుమతివ్వడంతో అడ్డుకోలేకపోయింది. కనుక ఈ వరుస ఘటనలన్నీ యాదృచ్చికమా లేక బండి సంజయ్‌కి మీడియా కవరేజ్ దొరకకూడదనే టిఆర్ఎస్, వైఎస్సార్ టిపిలు కలిసి ఆడిన డ్రామానా? అనే సందేహం కలుగుతోంది. ఒకవేళ వైఎస్ షర్మిల హడావుడి లేకపోయుంటే మీడియా అంతా బండి సంజయ్ పాదయాత్ర, భైంసాలో బిజెపి హడావుడి గురించే కవర్ చేసి ఉండేవి కదా?