తెలంగాణ మలిదశ ఉద్యమాలను టిఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఆమరణ నిరాహారదీక్షతో కీలక మలుపుతిప్పిన సంగతి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. 2009, నవంబర్లో 29న కరీంనగర్లో ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. అక్కడి నుంచి సిద్ధిపేటలోని దీక్షాస్థలానికి వెళుతుండగా దారిలో పోలీసులు అరెస్ట్ చేసి నీమ్స్ హాస్పిటల్కి తరలించారు. కేసీఆర్ అక్కడే 11 రోజుల పాటు ఆమరణ దీక్ష కొనసాగించారు. దాంతో అప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న యూపీయే ప్రభుత్వం దిగివచ్చి డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసేందుకు అంగీకరిస్తూ ప్రకటన చేసింది. అప్పుడు గానీ కేసీఆర్ దీక్ష విరమించలేదు. తెలంగాణ సాధనకు మార్గం సుగమం చేసిన కేసీఆర్ ఆమరణ దీక్షకు నేటికీ 13 ఏళ్ళు. ఆయన దీక్ష ప్రారంభించిన రోజుని ‘దీక్షా దివస్’ పేరుతో ఏటా టిఆర్ఎస్ శ్రేణులు ఘనంగా జరుపుకొంటున్నాయి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా టిఆర్ఎస్ శ్రేణులు ‘దీక్షా దివస్’ను ఘనంగా జరుపుకొంటున్నాయి.
అయితే తెలంగాణ సాధన కోసం పోరాడిన కేసీఆర్ నేటికీ పోరాడవలసి రావడమే చాలా బాధాకరం. తన ప్రభుత్వాన్ని కూల్చేవేసేందుకు బిజెపి చేస్తున్న ప్రయత్నాలను కేసీఆర్ చాలా అప్రమతంగా ఉంటూ ధీటుగా ఎదుర్కొంటున్నారు. బిజెపి వెనుక సర్వశక్తివంతమైన కేంద్ర ప్రభుత్వం ఉండగా, కేసీఆర్ వెనుక రాష్ట్ర ప్రజలున్నారు.
ఇదెలా ఉందంటే ఆనాడు కురుక్షేత్ర యుద్ధానికి ముందు దుర్యోధనుడు, అర్జునుడు శ్రీకృష్ణుడి సాయం కోరి వెళ్ళినప్పటి దృశ్యం కళ్ళ ముందు కదలాడుతుంది. శ్రీకృష్ణుడు అర్జునుడికే మొదటి అవకాశం ఇచ్చి “ఆయుధం పట్టని నేను ఒక్కడినే కావాలా?లేక అపార శక్తివంతమైన నా సైన్యం కావాలా?” అని అడిగితే అర్జునుడు శ్రీకృష్ణుడినే కోరుకొన్నాడు.
అందుకు దుర్యోధనుడు లోలోన చాలా సంతోషిస్తూ యాదవ సైన్యాన్ని తీసుకొన్నాడు. కానీ చివరికి ఏమైందో అందరికీ తెలుసు. కనుక టిఆర్ఎస్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మద్య జరుగుతున్న ఈ కురుక్షేత్ర మహాసంగ్రామంలో ‘ప్రజాస్వామ్యమనే శ్రీకృష్ణుడు’ ఎవరి పక్షాన్న నిలుస్తాడో వారిదే అంతిమ విజయం!