కేసీఆర్‌ హడావుడి అంతా ముందస్తు కోసమే...నా?

November 29, 2022


img

ఈసారి కూడా సిఎం కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలకి వెళతారని రాష్ట్ర బిజెపి నేతలు వాదిస్తున్నారు. 2023 ఏప్రిల్-మే నెలల్లో జరుగబోయే కర్ణాటక శాసనసభ ఎన్నికలతో బాటు తెలంగాణలో ముందస్తు ఎన్నికలు జరుగవచ్చని వాదిస్తున్నారు. కానీ ఈసారి షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలకి వెళతామని కేసీఆర్‌ చెప్పారు. మంత్రి హరీష్‌ రావు కూడా అదే చెప్పారు. బిజెపి జోస్యులు ముందస్తు ఎన్నికలు జరుగుతాయని, రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి వస్తుందని, టిఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు బిజెపిలో చేరుతారని, కేసీఆర్‌ కుటుంబం జైలుకి వెళుతుందని జోస్యం చెపుతుంటారని కానీ వారి జోస్యం ఫలించదని అన్నారు. 

కానీ కేసీఆర్‌ హడావుడి చూస్తే ముందస్తుకి వెళ్ళే సూచనలున్నాయని బిజెపి నేతలు వాదిస్తున్నారు. కేసీఆర్‌ జిల్లా పర్యటనలు,  ఫిబ్రవరిలో కొత్త సచివాలయం ప్రారంభోత్సవం, ఏప్రిల్ 14న డా.అంబేడ్కర్‌ విగ్రహావిష్కరణ, దళిత బంధు హడావుడి వంటివన్నీ ముందస్తు సూచనలే అని రాష్ట్ర బిజెపి నేతలు వాదిస్తున్నారు. తెలంగాణ సాధన కోసం కేసీఆర్‌ ఆమరణ దీక్ష చేసి విరమించిన ఈరోజుని ‘దీక్షా దివస్’ పేరుతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టిఆర్ఎస్‌ హడావుడి కూడా అందుకేనని రాష్ట్ర బిజెపి నేతలు వాదిస్తున్నారు. 

అయితే కాస్త లోతుగా ఆలోచిస్తే కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలకి వెళ్ళకపోవచ్చని అర్దమవుతుంది. గత ఎన్నికలప్పుడు శాసనసభ, లోక్‌సభ కలిపి ఒకేసారి ఎన్నికలకీ వెళ్తే టిఆర్ఎస్‌ నష్టపోవచ్చనే ఆలోచనతోనే కేసీఆర్‌ డిసెంబర్‌లో ముందస్తు ఎన్నికలకి వెళ్లారు. కనుక ఈసారి కూడా ఆ ప్రకారమే శాసనసభ, లోక్‌సభ ఎన్నికలు వేర్వేరుగానే జరుగుతాయి. కనుక కేసీఆర్‌ ప్రభుత్వానికి ఏదైనా తీవ్ర ప్రమాదం పొంచి ఉందని భావిస్తే తప్ప ముందస్తుకి వెళ్ళనవసరం లేదు. 

ముందస్తుకి వెళ్ళాలనుకొంటే టిఆర్ఎస్‌ ఎమ్మెల్యేలలో ఆందోళన మొదలవుతుంది. అప్పుడు వారిని బిజెపి సులువుగా ఆకర్షించగలదు. కేసీఆర్‌ కూడా ఈవిషయం గ్రహించారు కనుకనే టిఆర్ఎస్‌ విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటు చేసి ముందస్తుకి వెళ్ళబోవడం లేదని పార్టీలో సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ మళ్ళీ టికెట్లు ఇస్తానని ప్రకటించారనుకోవచ్చు. కనుక బిజెపి ముందస్తు కలలు కనే బదులు ఎన్నికలలో పోటీ చేసేందుకు అభ్యర్ధులను సిద్దం చేసుకొంటే మంచిదేమో?


Related Post