మంచిర్యాలలో పోలీస్ భర్త వేధింపులు భరించలేక భార్య ఆత్మహత్య

November 29, 2022


img

తెలంగాణ పోలీస్ శాఖ ప్రతిష్టకి భంగం కలిగించే ఘటన మరొకటి జరిగింది. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో తిర్యాణి పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ఆకుదారి కిష్టయ్య వేధింపులు భరించలేక అతని భార్య వనిత (35) ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొంది.  

చేనూరు మండలం సుద్దాల గ్రామానికి చెందిన కిష్టయ్యకి నస్పూర్‌కి చెందిన వనితకి సుమారు 15 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వారు మంచిర్యాల జిల్లా నస్పూర్‌లోని నాగార్జునకాలనీలో సింగరేణి క్వార్టర్స్‌లో అద్దెకుంటున్నారు. వారికి ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. చాలా కాలంగా కిష్టయ్య ఆమెను వేధిస్తున్నప్పటికీ వనిత ఏనాడూ ఆ విషయం ఎవరికీ చెప్పుకోలేదు. కానీ గత కొంతకాలంగా తనకు వేరే మగాళ్ళతో అక్రమ సంబంధాలున్నాయని అనుమానిస్తూ రోజూ వేధిస్తుండటంతో అది భరించలేక ఈ నిర్ణయం తీసుకొన్నట్లు వనిత సూసైడ్ నోట్‌లో వ్రాసింది. 

తన భర్త ఓ సైకో అని అతని వేధింపులు నానాటికీ ఎక్కువైపోతున్నందున పిల్లలని తీసుకొని పుట్టింటికి తిరిగి వెళితే తల్లితండ్రులకు భారం అవుతానని భావించి గత్యంతరం లేని పరిస్థితులలో ఆత్మహత్య చేసుకొంటున్నట్లు వనిత ఆ లేఖలో వ్రాసింది. తన సైకో భర్త వద్ద పిల్లలని ఉంచవద్దని ముగ్గురినీ చూసుకోవలసిందిగా ఆమె లేఖలో తన తల్లితండ్రులను అభ్యర్ధించింది. 

సోమవారం మధ్యాహ్నం ఇంటికి వచ్చిన కిష్టయ్య ఉరి వేసుకొన్న భార్యని చూసి భయంతో పారిపోయాడు. ఇరుగుపొరుగుల సమాచారం ఇవ్వడంతో ఎస్సై రవికుమార్ పోలీసులతో వచ్చి వనిత మృతదేహాన్ని పోస్టుమార్టం కొరకు మంచిర్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సూసైడ్ నోట్‌ ఆధారంగా హెడ్ కానిస్టేబుల్ కిష్టయ్యపై కేసు నమోదు చేసి గాలింపు మొదలుపెట్టారు.  


Related Post